: గుజరాత్ లో ఘోరం... చనిపోయిన పశువును తొలగించలేదంటూ, దళిత బాలుడిని చావగొట్టిన యువకులు

పశువుల మృతదేహాలను తొలగించలేదని ఆరోపిస్తూ, 15 ఏళ్ల యువకుడిని చావగొట్టిన వైనం గుజరాత్ లోని భావ్రా ప్రాంతంలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పదవ తరగతి చదువుతున్న బాధితుడు చాక్లెట్లు కొనుక్కునేందుకు వెళ్లిన వేళ, సాహిల్ ఠాకూర్, శర్వార్ పథాన్ అనే యువకులు అతని వద్దకు వచ్చారు. "చనిపోయిన పశువులను ఎందుకు తొలగించడం లేదు?" అని ప్రశ్నించగా, అది తమ వర్గమంతా కలసి తీసుకున్న నిర్ణయమని ఆ బాలుడు చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వారు, అతనిపై దాడికి దిగారు. రాళ్లతో కొట్టారు. ఆ తరువాత ఆ బాలుడు గాయాలతో గ్రామ పెద్ద వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా, పట్టించుకోలేదు. ఈ ఘటనతో గ్రామంలో నివాసమున్న 20కి పైగా దళిత కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. దక్షిణ గుజరాత్ తో గోమాంసాన్ని తరలిస్తున్నారన్న ఆరోపణలతో నలుగురు యువకులను హింసించిన ఘటనకు నిరసనగా, ఈ గ్రామంలోని దళితులంతా, మృతిచెందిన పశువుల కళేబరాలను తొలగించరాదని నిర్ణయం తీసుకున్నారు. కాగా, బాలుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

More Telugu News