: సింధుకి 5 కోట్లు, సాక్షికి కోటి రూపాయలు: కేసీఆర్

రియో ఒలింపిక్స్ లో పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రోత్సాహకంగా అందించనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే గోపీచంద్ అకాడమీకి దగ్గర్లో వెయ్యి గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సింధు కావాలంటే తెలంగాణలో ప్రభుత్వోద్యోగం కూడా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అలాగే ఆమె కోచ్ గోపీచంద్ కు కోటి రూపాయల నగదు బహుమతి అందించనున్నట్టు ఆయన తెలిపారు. సింధుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో కాంస్యపతకం సాధించిన సాక్షీ మాలిక్ కు కోటి రూపాయల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఒలింపిక్స్ లో ఇద్దరు మహిళలు పతకాలు సాధించి, మహిళా శక్తిని చాటారని ఆయన అభినందించారు. గతంలో ఆ అమ్మాయి రెండు సార్లు కొంచెం ఆర్ధిక సహాయం కావాలని కోరినప్పుడు ప్రభుత్వ పక్షాన 40 లక్షల రూపాయల సహాయం చేయడం జరిగిందన్నారు. అలాగే ఆ అమ్మాయికి కోచ్ గా ఉన్నటువంటి గోపీచంద్ గారికి కూడా ఆ అమ్మాయికి మంచి కోచింగ్ ఇవ్వమని చెప్పి వారికి కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గతంలో సానియా మీర్జాకు ప్రోత్సాహం ప్రకటించిన తరువాత వరుసగా 30 మ్యాచ్ లలో విజయం సాధించిందని ఆయన తెలిపారు. ఇప్పుడు సింధుకి కూడా 5 కోట్ల ప్రోత్సహకం అందిస్తున్నామని, ఆమె కూడా అలాంటి ప్రదర్శనను చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News