: అక్షయ గోల్డ్ డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు!

అధిక వడ్డీలను ఎరగా వేసి జనాన్ని నిలువునా ముంచేసిన మాయగాళ్లకు బెయిలొచ్చింది. అక్షయ గోల్డ్ పేరిట రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు ఏపీలోని ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లకు సొమ్ము చెల్లించడంలో ఆ సంస్థ విఫలమైంది. దీంతో గుంటూరు జిల్లా తెనాలి, ప్రకాశం జిల్లా చీరాల పోలీస్ స్టేషన్లలో సంస్థ డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావు, అదనపు డైరెక్టర్ తాళ్లూరి శ్రీనివాసరావులపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ క్రమంలో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిన్న సానుకూలంగా స్పందించింది. తెనాలి, చీరాల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి ఇద్దరు డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నిన్న తీర్పు చెప్పారు. రూ.10 వేల చొప్పున సొంత పూచీకత్తు, పోలీసుల విచారణలకు సహకరించాలన్న షరతులతో న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు.

More Telugu News