: సంచలనం సృష్టిస్తోన్న ‘డుయో’ యాప్.. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ను దాటేసిన గూగుల్ కొత్త యాప్‌!

ఆధునిక కాలాన్ని స్పీడ్ యుగంగా అభివ‌ర్ణించవచ్చు. మారుతున్న కాలానికనుగుణంగా ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి రోజురోజుకీ మార్కెట్లోకి వ‌చ్చి ప‌డుతున్నాయి. ప్రస్తుతం ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్‌లే క‌న‌ప‌డుతున్నాయి. జేబులో పెట్టుకొని ఎక్క‌డిక‌యినా తీసుకువెళ్లే వీలు, అందులోనే ఇంట‌ర్నెట్ సౌక‌ర్యంతో ప్ర‌పంచాన్ని అర‌చేతిలో చూసే వీలు ఉండ‌డంతో స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరుగుతూ వెళుతోంది. మొబైల్‌ల‌లో టెక్నాలజీ వాడకాన్ని గుర్తిస్తోన్న కంపెనీలు కొత్త‌కొత్త అప్లికేషన్లను తీసుకొస్తున్నాయి. ప్ర‌స్తుతం మొబైల్ యాప్‌ల యుగం న‌డుస్తోంద‌ని గుర్తిస్తోన్న కంపెనీలు, ఇప్ప‌టికే స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు ముందుకు ఎన్నో యాప్‌ల‌ను తీసుకొచ్చాయి. ఒక‌దాన్ని త‌ల‌ద‌న్నేలా మ‌రొక‌టి త‌యారు చేస్తూ దూసుకుపోతున్నాయి. ప్ర‌స్తుతం గూగుల్ తన కొత్త వీడియో కాలింగ్‌ యాప్ తో స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన వీడియో కాలింగ్‌ యాప్‌ ‘డుయో’ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఫ్రీ డౌన్‌లోడ్స్‌ విభాగంలో అత్యధిక డౌన్‌లోడ్స్‌ కలిగిన యాప్‌గా మొద‌టి ప్లేస్‌లో నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ విభాగంలో ముందున్న‌ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, పోకేమాన్‌గో యాప్‌లు ‘డుయో’ దెబ్బ‌కు వాటి స్థానాల‌ను కోల్పోయాయి. మెసెంజర్‌, వీడియో కాలింగ్‌ యాప్‌లకు పోటీగా యాప్‌ను తీసుకొస్తున్నామ‌ని తెలిపిన గూగుల్ డుయోను చెప్పిన‌ట్లుగానే తీసుకొచ్చి అత్య‌ధిక డౌన్‌లోడ్‌లు సాధించి స‌త్తా చాటింది. ఎంతో పోటీని ఎదుర్కొని ముందుస్థానంలో నిలిచింది. ఈ వన్‌ టచ్‌ వీడియో కాలింగ్‌ యాప్ ప‌ట్ల స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. రేటింగ్‌లో 4.0 తో ఫేస్‌బుక్‌, 3.9 తో ఫేస్‌బుక్‌ మెసెంజర్ ఉంటే వాటిని మించిన రేటింగ్‌ 4.5 తో డుయో అగ్రస్థానంలో నిలిచింది.

More Telugu News