: నయీమ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను పేదలకు పంచండి: చాడ వెంకటరెడ్డి డిమాండ్

ఇటీవ‌ల‌ పోలీసుల చేతిలో ప్రాణాలు విడిచిన గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్ కేసు అంశంపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పందించారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వం, పోలీసుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌యీమ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎదగడానికి వారే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. న‌యీమ్‌, అత‌ని అనుచ‌రుల‌ ఆగడాలను అడ్డుకునే క్ర‌మంలో ప్రభుత్వం పూర్తిగా అస‌మ‌ర్థ‌త ప్ర‌ద‌ర్శించింద‌ని అన్నారు. ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌ని ప్రోత్స‌హించిన మంత్రులు, పోలీసు ఉన్న‌తాధికారుల‌పై పూర్తి విచార‌ణ జ‌రిపించాల‌ని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. వారిపై చ‌ర్య‌లు తీసుకొని, మ‌ళ్లీ న‌యీమ్ లాంటి గ్యాంగ్‌స్ట‌ర్‌లు పుట్టుకురాకుండా చూడాల‌ని డిమాండ్ చేశారు. బెదిరింపుల‌కు దిగి న‌యీమ్ దోచుకున్న ఆస్తులు, భూముల‌ను ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇచ్చేయాల‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు ఇచ్చిన పవ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్లు త‌ప్పుల త‌డ‌కేన‌ని చాడ వెంకటరెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ పార్టీలు చెప్పిన లెక్కల తప్పులు బ‌య‌ట పడతాయని అన్నారు. తెల‌ంగాణ‌కు కరవు నష్టపరిహారాన్ని తీసుకురావ‌డంలో టీఆర్ఎస్ స‌ర్కార్ స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇస్తాన‌ని చెప్పిన రూ.లక్ష రుణమాఫీ నిధులు పూర్తిగా ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రైతుల‌కు ప్ర‌భుత్వం కరవు నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిందేన‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News