: కేంద్రం ఆర్థిక‌సాయం పేరుతో ఏపీకి భిక్ష‌మేస్తోంది: అంబ‌టి రాంబాబు ఆగ్రహం

కేంద్రం ఆర్థికసాయం పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి భిక్ష‌మేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈరోజు హైద‌రాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్రం చేస్తోన్న సాయాన్ని చూసి సంతోష‌ప‌డాలో బాధ‌పడాలో అర్థం కాని ప‌రిస్థితి ఉంద‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ప్ర‌భుత్వం ఆ నిధుల‌ను తీసుకుంటూ హోదా ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రానికి హోదాపై ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ డ్రామా ఆడుతున్నారని అంబ‌టి రాంబాబు అన్నారు. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న చంద్రబాబు వారికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జ‌ల ముందు హోదా కోసం పోరాడుతున్నామ‌ని మ‌భ్య‌పెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం చట్టంలో పెట్టిన అంశాల‌ను కూడా అమ‌లు చేయ‌క‌పోతే ఎలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా ఇస్తార‌ని ఏపీ ప్ర‌జ‌లు ఆశ‌గా ఎదురుచూస్తున్నారని అన్నారు. కేంద్రం, టీడీపీ నేత‌లు కాక‌మ్మ క‌బుర్లు చెబుతున్నారని ఆయ‌న పేర్కొన్నారు. 'హోదా తీసుకురాగ‌లితే తీసుకురండి, లేదంటే ఎన్డీఏలో కొన‌సాగ‌కండి, అంద‌రం క‌లిసి పోరాడ‌దాం' అని ఆయ‌న వ్యాఖ్యానించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు స‌మ‌ర్థంగా ముందుకు సాగ‌డం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం పేరుతో భిక్షం తీసుకోవ‌డం కాదు, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్ర‌యోజ‌నాల‌ను సాధించుకోవాలని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక హోదా కాకుండా ప్ర‌త్యేక‌ ప్యాకేజీ అంటూ ప్ర‌చారం కొన‌సాగుతోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

More Telugu News