: జయలలిత ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్

ఈ ఏడాది మే నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలిచిన అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నిక చెల్లదంటూ ఒక మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కే నగర్ కు చెందిన ప్రవీణ అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఎన్నికల్లో జయలలితకు మద్దతుగా ప్రభుత్వ యంత్రాంగమంతా వ్యవహరించిందని, అధికారులంతా ఆమె గెలుపు కోసం నియోజకవర్గంలో పని చేశారని, రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆ పిటిషన్ లో ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు జరిగేలా ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఎస్.దురైస్వామి, కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని, కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.

More Telugu News