: జాతీయ పార్టీల బాటలో వైసీపీ!... రాజకీయ వ్యూహకర్త సేవలకు జగన్ నిర్ణయం!

నిజమేనండోయ్... జాతీయ పార్టీల బాటలో ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అడుగులేస్తోంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ... రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిశోర్ సేవలను విరివిగా వినియోగించుకున్నారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత భారీ విజయాన్ని బీజేపీ దక్కించుకుంది. ఆ తర్వాత బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కూడా ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకున్నారు. బీహార్ కే చెందిన ప్రశాంత్ కిశోర్... సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పనిచేసినా... సొంత రాష్ట్ర సీఎం నితీశ్ నుంచి పిలుపు రావడంతో ఏడాదిలోగానే బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాలు రచించాల్సి వచ్చింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటోంది. వెరసి రాజకీయ వ్యూహకర్తల సేవలు లేనిదే విజయం సాధించలేమన్న రీతిలో జాతీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇదే యోచనలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. గడచిన ఎన్నికల్లో అందినట్లే అంది అధికారం చేజారడంతో జగన్ షాక్ తిన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాదించకుంటే భవిష్యత్తు ఉండదని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీల గెలుపు మంత్రం రాజకీయ వ్యూహకర్త సేవలను వినియోగించుకునేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిన్న లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం యూపీ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీకి పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్తనే తాను కూడా వినియోగించుకోవాలని ఆయన చూస్తున్నారట. మరి జగన్ ఎంచుకున్న రాజకీయ వ్యూహకర్త... ప్రశాంత్ కిశోరా? కాదా? అన్న విషయం తేలాల్సి ఉంది.

More Telugu News