: తెలంగాణ టీడీపీ ఆశలను నీరుగార్చిన ప్రధాని.. మోత్కుపల్లికి మూసుకుపోయిన అవకాశాలు!

గవర్నర్ గిరీపై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పెట్టుకున్న ఆశలను ప్రధాని నరేంద్రమోదీ అడియాసలు చేశారు. తాజాగా మూడు రాష్ట్రాలకు ప్రకటించిన కొత్త గవర్నర్ల పేర్లలో తన పేరు లేకపోవడంతో మోత్కుపల్లి తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఆయనకు గవర్నర్ పదవి ఖాయమని నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా మహానాడులో బహిరంగంగానే ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని వద్ద మోత్కుపల్లి పేరును ప్రస్తావించారు. అయితే ఏమైందో తెలియదు కానీ పలు దఫాలుగా రాష్ట్రాలకు నియమిస్తున్న గవర్నర్ల స్థానంలో మోత్కుపల్లికి చోటు లభించడం లేదు. ఇప్పుడు మిగిలిన మూడు రాష్ట్రాలకు కూడా గవర్నర్లను ప్రకటించడంతో ఆశలు అడుగంటిపోయాయి. ఇప్పుడు మోత్కుపల్లికి ఒకే ఒక్క చాన్స్ మిగిలి ఉంది. వచ్చే ఏడాదితో తమిళనాడు గవర్నర్ రోశయ్య పదవీ కాలం ముగియనుంది. మరి ఆ స్థానంలో మోత్కుపల్లికి ప్రధాని అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే. అయితే మరోసారి కూడా రోశయ్యనే గవర్నర్‌గా కొనసాగించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానిని అభ్యర్థించారు. అదే కనుక జరిగితే మోత్కుపల్లికి ఉన్న ఒకే ఒక్క అవకాశం కూడా మూసుకుపోయినట్టే. ‘‘నన్ను గవర్నర్‌ను చేస్తారన్న విషయం నాక్కూడా తెలియదు. నువ్వు ఏ క్షణాన్నయినా గవర్నర్ అయ్యే అవకాశం ఉందని గతేడాది మా బాస్ చెప్పినప్పుడు నాకు తెలిసింది. అయితే టీడీపీ నేతలకు ఎందుకు పదవులు రావడం లేదో మాత్రం నాకు తెలియడం లేదు’’ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

More Telugu News