: మంగళూరు విమానాశ్రయంలో 26 పాస్ పోర్టులు కలిగి వున్న వ్యక్తి అరెస్టు

ఒక మనిషికి ఒక పాస్ పోర్టు ఉంటుంది. అయితే, ఏకంగా 26 పాస్ పోర్టులు కలిగివున్న ఓ వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో నిబంధనలకు వ్యతిరేకంగా 26 పాస్ పోర్టులు కలిగిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతనిని పట్టుకుని విచారించగా, తన పేరు మహ్మద్ పనపిల్‌ అని, తాను కేరళలోని కన్నూరు వాసినని పేర్కొన్నాడు. దుబాయ్ నుంచి మంగళూరు వచ్చానని, మంగళూరు నుంచి కన్నూరు వెళ్లి, అక్కడి నుంచి మక్కాకు వెళ్లనున్నానని విచారణలో వెల్లడించాడు. అతని మాటలు, నడవడిక అనుమానాస్పదంగా ఉండడంతో లగేజీను సోదా చేయగా, అందులో 26 పాస్‌ పోర్టులు లభ్యమయ్యాయి. వాటిల్లో రెండు పాస్ పోర్టులు అమెరికావి కాగా, 24 పాస్ పోర్టులు భారత్ కు చెందినవని అధికారులు గుర్తించారు. దీంతో అతనిని ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News