: మరొక్క అడుగేస్తే పతకం ఖాయం... బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి తెలుగమ్మాయి సింధు

ఒక్క పతకం కోసం కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్న వేళ తెలుగమ్మాయి పీవీ సింధు వారి ఆశలు నిజం చేసేందుకు మరింత దగ్గరైంది. ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్నా ఒక్క పతకం కూడా భారత్ ఖాతాలో పడకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న క్రీడాభిమానులకు తీపి కబురు చెప్పేలా, క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్-2 క్రీడాకారిణి వాంగ్ యిహాన్‌ పై విజయం సాధించింది. రాత్రి జరిగిన హోరాహోరీ పోరులో 22-20, 21-19తో వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. రేపు సాయంత్రం జర్మనీ షట్లర్‌తో సింధు సెమీఫైనల్స్‌లో తలపడనుంది. సెమీస్‌లోనూ ఇదే ఆటతీరు కనబరిచి విజయం సాధిస్తే, స్వర్ణ లేదా రజత పతకం భారత్ ఖాతాకు చేరుతుంది. ఓడిపోతే, మరో సెమీఫైనల్ పోటీలో ఓటమి చెందే క్రీడాకారిణితో సింధు కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంటుంది. ఏదిఏమైనా రియో-2016లో మరొక్క గెలుపు సింధు ఖాతాలోకి వస్తే పతకం ఖాయం. క్వార్టర్ ఫైనల్స్ గెలుపుతో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సెమీస్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ అమ్మాయి సైనా నెహ్వాల్ ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News