: రియోలో దీప పరాజిత.. భారతీయుల మనసులలో విజేత!

రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన జిమ్నాస్ట్ దీపాకర్మాకర్‌ను దురదృష్టం వెంటాడింది. మహిళల వాల్ట్ ఫైనల్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచినా పతకం తృటిలో చేజారింది. అయితే రియోలో ఓడినా కోట్లాదిమంది భారతీయుల మనసులు మాత్రం గెలుచుకుంది. పతకం కోసం శాయశక్తులా కృషి చేసింది. మొదటి ప్రయత్నంలో 14.866, రెండో ప్రయత్నంలో 15.266 పాయింట్లు సాధించిన దీప సగటున 15.066 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్ 15.966 స్కోరుతో ఈ ఈవెంట్‌లో స్వర్ణం ఎగరేసుకుపోయింది. రష్యాకు చెందిన మరియా పాసెకా 15.253 పాయింట్లతో రజతం, స్విట్జర్లాండ్‌కు చెందిన స్టెయిన్ గ్రుబెర్ 15.216 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నారు. దీప కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్యం కోల్పోవడం గమనార్హం. ఇక టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మిర్జా, రోహన్ బోపన్న జోడీ కాంస్య పతక వేటలో చతికిల పడింది. పతకం గ్యారెంటీ అని భావించిన పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. బ్యాడ్మింటన్‌లో భారత ఆశాకిరణం సైనా నెహ్వాల్ సైతం నిరాశపరిచింది. ఇక ఆశలన్నీ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌పైనే ఉన్నాయి. స్వీడన్‌కు చెందిన హెన్రీ హర్‌స్కైనెన్‌ను 21-6, 21-18 తేడాతో మట్టి కరిపించి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.

More Telugu News