: మోదీ సలహాలు కోరిన వేళ... సచిన్ ఇచ్చిన సలహా ఇదే!

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, ఎర్రకోటపై నుంచి తాను ఏం మాట్లాడాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరిన వేళ, భారతరత్న సచిన్ టెండూల్కర్ స్పందించారు. రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున పాల్గొంటున్న క్రీడాకారులకు మానసిక ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడాలని, దేశానికి పేరు తెచ్చిన ఆటగాళ్లను ప్రస్తావించాలని కోరారు. రియోలో ఓటమి పాలైన అథ్లెట్లలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలని సూచించారు. "మీ నుంచి వచ్చే మాటలు తీవ్ర నిరాశలో ఉన్న ఆటగాళ్లు కొంత కోలుకునేందుకు సహకరిస్తాయి. తదుపరి తమ ఆటను మెరుగుపరచుకునేందుకు తోడ్పడతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడ కలిసున్న ఆటగాళ్లు ఎంతో అనుభవాన్ని సాధించారు" అని సచిన్ అన్నారు. రియలో ఒలింపిక్స్ కు వెళ్లిన భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, ఒలింపిక్స్ తొలి రోజు నుంచే భారత జట్టుతో కలిసి రియోలో ఉన్నారు. కాగా, నరేంద్ర మోదీ పేరిట విడుదలైన 'నమో' యాప్ ద్వారా తనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని మోదీ స్వయంగా కోరిన సంగతి తెలిసిందే.

More Telugu News