: ఐక్యరాజ్యసమితిలో భారత్ మాకు మద్దతిస్తుందని ఆశిస్తున్నాం: పాకిస్థాన్ హక్కుల కార్యకర్తలు

బెలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీరుల్లో పాక్ సైన్యం మానవ హక్కులు ఉల్లంఘిస్తోందని, ప్రజల మానప్రాణాలు హరిస్తోందని బెలూచిస్తాన్‌ హక్కుల కార్యకర్త హమ్మల్‌ హైదర్‌ బలూచ్ ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి, ఇక్కడి ప్రజల హక్కులను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పాక్ సైన్యం ఆగడాలు, పాక్ ప్రభుత్వ దౌర్జన్యాలను బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేయాలని మోదీ విదేశాంగ శాఖను ఆదేశించడం స్వాగతించదగ్గ పరిణామమని ఆయన తెలిపారు. బెలూచిస్థాన్ ప్రజలు భారత్‌ తో ఉమ్మడి భావజాల అనుబంధాన్ని కలిగి ఉండి, లౌకిక, ప్రజాస్వామిక విలువలను విశ్వసిస్తారనే కారణంతో పాక్‌ ప్రభుత్వం సింధీ రాజకీయ కార్యకర్తలను దారుణంగా హతమారుస్తున్నదని ఆయన చెప్పారు. ఇక్కడి రాజకీయ కార్యకర్తలను హత్యలుచేస్తూ, మత గ్రూపులకు పాక్ మద్దతు పలుకుతోందని, దీంతో ఇక్కడ అరాచకం రాజ్యమేలుతోందని, ఇది ప్రపంచానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిబంధనలను పాక్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. భారత ప్రధాని మోదీ తొలిసారి తమకు మద్దతు ప్రకటించడం ముదావహమని, ఇందుకు ఆయనకు ధన్యవాదాలని ఆయన చెప్పారు. పీవోకే, బెలూచిస్థాన్‌ ప్రజలకు మద్దతుగా ప్రధాని మోదీ మాట్లాడినందుకు కృతజ్ఞతలని మరో హక్కుల కార్యకర్త నైలా ఖాద్రి బలూచ్ చెప్పారు. బెలూచిస్థాన్ ప్రజలైన తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యను సెప్టెంబర్‌ లో జరిగే ఐక్యారాజ్యసమితి సమావేశాల్లో భారత్‌ లేవనెత్తుతుందని తాము ఆశిస్తున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, బెలూచిస్థాన్, పీవోకే ప్రజలకు సంఘీభావం ప్రకటించాలని, అక్కడ జరుగుతున్న ఉల్లంఘనలను బాహ్యప్రపంచానికి తెలియజేయాలని మోదీ విదేశాంగ శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా పీవోకే భారత్ లో అంతర్భాగమని కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.

More Telugu News