: నయీమ్ ఎలా ఉంటాడో కూడా నిన్నటిదాకా నాకు తెలియదు!: దినేశ్ రెడ్డి

గ్యాంగ్ స్టర్ నయీమ్ తో మాజీ డీజీపీలకు సంబంధాలున్నాయన్న మీడియా కథనాలపై వివరణ ఇచ్చిన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన బీజేపీ నేత వి.దినేశ్ రెడ్డి ఓ రేంజిలో ఫైరయ్యారు. లకడికాపూల్ లోని అశోకా హోటల్ లో కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులతో నవ్వుతూనే మాట్లాడిన దినేశ్ రెడ్డి... తనపై ప్రస్తుతమే కాకుండా గతంలో వచ్చిన పలు కథనాలను నిర్ద్వంద్వంగా ఖండించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ పై నక్సల్స్ దాడి సందర్భంగా తాను ఆయన పక్కనే ఉన్నానని ఓ కథనం రాసిన ఓ మీడియా సంస్థ ఆ తర్వాత క్షమాపణ చెప్పిన వైనాన్ని దినేశ్ రెడ్డి ప్రస్తావించారు. నాటి ఘటనలో వ్యాస్ కు 400 గజాల దూరంలో తాను ఉన్నానని, తామంతా స్పందించేలోగానే నక్సల్స్ పారిపోయారని ఆయన పేర్కొన్నారు. తాజాగా నయీమ్ ఎన్ కౌంటర్ పై దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు పరిమితులున్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాలను దినేశ్ రెడ్డి ఖండించారు. మాజీ డీజీపీలనే కాకుండా ప్రస్తుతం డీజీపీ పోస్టులో ఉన్న ఐపీఎస్ అధికారిని కూడా విచారించే అధికారం సిట్ కు ఉంటుందన్నారు. ఈ విషయాలను తెలుసుకోకుండా మీడియా ఇష్టారాజ్యంగా కధనాలు రాయడం సరికాదన్నారు. నయీమ్ ఎలా ఉంటాడో కూడా నిన్నటిదాకా తనకు తెలియదని ఆయన చెప్పారు. షాద్ నగర్ లో నయీమ్ చనిపోయిన తర్వాత మీడియాలోనే అతడి ఫొటోను మొదటిసారిగా చూశానన్నారు. అయినా నయీమ్ లాంటి గ్యాంగ్ స్టర్లను విచారించడం డీజీపీ స్థాయి అధికారుల బాధ్యత కాదన్నారు. అందుకోసం డీజీపీ స్థాయి కంటే కింద పలువురు అధికారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

More Telugu News