: ఈ జీతాలు ఏ మూలకీ సరిపోవడం లేదు... వేతనాలు పెంచండి: రాజ్యసభలో ఎంపీల డిమాండ్

ఢిల్లీ ఎమ్మెల్యేల కన్నా ఎంపీలు తీసుకునే వేతనం తక్కువని, వెంటనే తమ వేతనాలు పెంచాలంటూ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ రోజు రాజ్యసభలో జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ, ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుతో ఎంపీల వేతనాల కన్నా ప్రభుత్వ పీఏల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. తమ వేతనాలు మహారాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాల్లో సగం కూడా ఉండవని, తెలంగాణ ఎమ్మెల్యేల జీతంతో పోలిస్తే తమకిస్తున్నది మూడో వంతేనని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగినా ఎంపీల జీతం మాత్రం పెరగలేదని అన్నారు. ఎంపీల వేతనాలను, అలవెన్స్ లను రెట్టింపు చేసి రూ.2.8 లక్షలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందని, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ నివేదికపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ప్రధాని పర్యటనలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తమ జీతాలు పెంచే విషయంలో మాత్రం స్పందించడం లేదన్నారు. ఎంపీల జీతాలు పెంచాలన్న డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన హుస్సేన్ దల్ వాయి కూడా మద్దతు తెలిపారు.

More Telugu News