: నా తల్లిని సజీవదహనం చేసిన హంతకులను శిక్షించండి: సీఎంకు రక్తంతో ఉత్తరం రాసిన బాలిక

తన తల్లిని చంపిన హంతకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం అఖిలేష్ యాదవ్ కు యూపీ బాలిక ఒక లేఖ రాసింది. ఈ లేఖను మామూలుగా ఇంకుతో కాదు, తన రక్తంతో రాసింది. బులంద్ షహర్ పట్టణానికి చెందిన ఒక వివాహితకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె ఈ లేఖను సీఎంకు రాసింది. మగ సంతానానికి జన్మ నివ్వలేదనే కారణంగా తన తల్లిని తన తండ్రి మనోజ్ బన్సాల్, ఇతర కుటుంబసభ్యులు తమ కళ్లెదుటే సజీవదహనం చేశారని, తనను, తన చెల్లిని ఒక గదిలో బంధించి తమ తల్లికి నిప్పంటించారని పేర్కొంది. తనను, తన చెల్లిని కూడా చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని, ఈ విషయమై పోలీసులు తమకు ఎటువంటి సాయం చేయకపోగా, నిందితులకు వారు రక్షణగా నిలుస్తున్నారని ఆ లేఖలో పేర్కొంది. కాగా, ఈ జులైలో ఈ విషయమై సీఎం అఖిలేష్ కు ఈ బాలిక ఒక లేఖ రాసింది. అయితే, దీనిపై సీఎం స్పందించకపోవడంతో, తాజాగా మరోమారు ఈ లేఖను తన రక్తంతో రాసింది. ఈవిధంగా చేస్తే సీఎం స్పందిస్తారనే ఇలా లేఖ రాశానని ఆ బాలిక పేర్కొంది. మహిళను చంపిన మర్నాడే మనోజ్ బన్సాల్ ను అరెస్ట్ చేశారు. అయితే, ఆయన ఇతర కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు కానీ, వారిని అరెస్ట్ చేయలేదని సదరు బాలిక ఆరోపించింది. నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. అయితే, బులంద్ షహర్ సీనియర్ ఎస్పీ అనీస్ అన్సారీ మాత్రం ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితులను వదిలిపెట్టమని చెబుతున్నారు.

More Telugu News