: జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన మొద‌టి రాష్ట్రం అసోం

అన్ని అడ్డంకులను తొల‌గించుకొని రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు జీఎస్‌టీ బిల్లును అసోం శాస‌న‌స‌భ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన మొద‌టి రాష్ట్రంగా అసోం నిలిచింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు అతిత్ షా ఇటీవ‌లే జీఎస్‌టీ బిల్లుపై చ‌ర్చ‌లు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. దాని ఫలితం అసోం నుంచి మొద‌ట‌గా వ‌చ్చింది. మూడు నెల‌ల క్రితం బీజేపీ యువ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. సర్బానంద సోనోవాల్ అసోం శాస‌న‌స‌భ‌లో జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందిన సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో స్పందించారు. జీఎస్‌టీ బిల్లుతో అసోం రాష్ట్రానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నట్లు తాను న‌మ్ముతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఆర్థిక ప‌రంగా త‌మ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. కాగా, పార్లమెంటు ఆమోదించిన ఈ జీఎస్‌టీ బిల్లుకు కనీసం 16 రాష్ట్రాలు కూడా ఆమోదం తెలపాలి.

More Telugu News