: అమెరికా మెడికల్ కంపెనీ ఒత్తిడి భరించలేకే భారత ఉద్యోగి ఆశిష్ ఆత్మహత్య.. ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడి

టార్గెట్ల విషయంలో కంపెనీ తెస్తున్న ఒత్తిడిని భరించలేకే అమెరికాకు చెందిన అబాట్ ల్యాబొరెటరీ కంపెనీ భారత ఉద్యోగి మృతి చెందినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. హెల్త్‌కేర్ కంపెనీ అయిన అబాట్‌లో ఇండోర్‌కు చెందిన ఆశిష్ అవాస్తి(27) సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. గతనెలలో అతను ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. దీంతో కంపెనీకి చెందిన 250 మంది సహ ఉద్యోగులు కంపెనీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆశిష్ జేబులో ఓ సూసైడ్ నోట్ దొరికిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. "కంపెనీ విధించిన టార్గెట్లను పూర్తిచేయలేకపోతున్నా. దీంతో కంపెనీ నాపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. నేనిక భరించలేను. చనిపోవాలనుకుంటున్నా" అని రాసి ఉన్న లేఖ దొరికిందని పేర్కొంది. కాగా టార్గెట్లపై కంపెనీ యాజమాన్యం ఆంక్షలు విధించడం, ఒత్తిడి తేవడంతో చాలామంది ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఉద్యోగులపై టార్గెట్లు విధిస్తూ వారిని ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్యలకు కారణమవుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని మాజీ ఉద్యోగులు కోరుతున్నారు. కాగా టార్గెట్లపై వస్తున్న వార్తలు అవాస్తవమని కంపెనీ కొట్టిపడేసింది.

More Telugu News