: నయీమ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు?... దర్యాప్తులో వేగాన్ని పెంచిన సిట్!

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగం పెంచింది. పలువురు రాజకీయ నేతలు, పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలు నెరపిన నయీమ్... పాలమూరు జిల్లా షాద్ నగర్ లో ఇటీవల జరిగిన గ్రేహౌండ్స్ ఎదురుకాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటికే రెండేళ్లకు పైగా అతడి కోసం వేట సాగించిన గ్రేహౌండ్స్ బలగాలు ఎట్టకేలకు అతడిని మట్టుబెట్టగలిగాయి. ఈ కేసు ప్రాధాన్యం దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు దానికి సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డిని అధిపతిగా నియమించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన నాగిరెడ్డి సిట్ లో మిగిలిన సభ్యులను ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసే ఉద్దేశంతో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక కోర్టు ద్వారా నయీమ్ కు చెందిన అన్ని కేసులను ఒకే దరిన విచారించే అవకాశాలున్నాయని, వెరసి కేసులన్నీ త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశాలున్నాయని సిట్ వాదిస్తోంది. మరి సిట్ ప్రతిపాదనకు తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News