: ఫోర్బ్స్ 'టెక్ టైకూన్స్' జాబితా విడుదల... టాప్-20లో ఇండియన్స్ ఇద్దరు మాత్రమే!

ప్రపంచంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలను స్థాపించి టాప్-100లో నిలిచిన వారి జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో టాప్-20లో ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే స్థానం లభించింది. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ, హెచ్సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ లు టాప్-20లో స్థానం సంపాదించారు. గూగుల్ బాస్ ఎరిక్ స్కమిడ్త్, ఉబెర్ సీఈఓ ట్రావిస్ కలానిక్ లకన్నా వీరు ముందుండటం గమనార్హం. 2016లో ప్రపంచంలోని 100 మంది అత్యంత ధనవంతులైన టెక్నాలజీ వ్యక్తుల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 78 బిలియన్ డాలర్ల ఆస్తితో తొలి స్థానంలో నిలిచాడు. అజీం ప్రేమ్ జీ 16 బిలియన్ డాలర్ల ఆస్తులతో 13వ స్థానంలో, శివ్ నాడార్ 11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో 17వ స్థానంలోనూ నిలిచారు. ఈ జాబితాలో భారత సంతతి అమెరికన్లు రమేష్ వాద్వానీ (సింఫనీ సీఈఓ) భరత్ దేశాయ్ (సింటెల్ వ్యవస్థాపకుడు) దంపతులకూ స్థానం లభించింది. ఇండియాలోని మూడవ అతిపెద్ద ఔట్ సోర్సింగ్ సంస్థను నిర్వహిస్తున్న ప్రేమ్ జీ, గడచిన ఏడాది కాలంగా విలీనాలకు ప్రయత్నిస్తున్నారని, అలాగే తన కుమారుడు రిషద్ ను సంస్థలో ఉన్నత పదవిలో కూర్చోబెట్టిన అజీం, అతనికి మరిన్ని బాధ్యతలు అప్పగించే ఉద్దేశంలో ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. హెచ్సీఎల్ వ్యవస్థాపకుడిగా ఉన్న నాడార్, హెచ్సీఎల్ టాలెంట్ కేర్ పేరిట నూతన గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాన్ని పెంచేలా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపింది. కాగా, టాప్-100 టెక్ జెయింట్ల ఆస్తుల విలువ గత సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ జాబితాలో సగం మంది అమెరికాకు చెందిన వారే ఉండగా, టాప్-10లో ఎనిమిది మంది అమెరికన్లే కావడం గమనార్హం. ఆ తరువాతి స్థానంలో 19 మందితో చైనా నిలిచింది. కెనడాకు చెందిన ఐదుగురికి, జర్మనీకి చెందిన నలుగురికీ స్థానం లభించింది. 100 మంది బిలియనీర్ల సగటు వయసు 53 సంవత్సరాలని ఫోర్బ్స్ పేర్కొంది.

More Telugu News