: న‌యీమ్ కేసులో పెద్ద‌పెద్ద వ్య‌క్తుల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు: ఉమామాధ‌వ‌రెడ్డి త‌న‌యుడు

గ్యాంగ్ స్టర్ నయీమ్ తో త‌మ కుంటుంబానికి సంబంధాలున్నట్లు వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల ప‌ట్ల మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి స్పందించారు. టీడీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఎలాంటి భూదందాలు జ‌ర‌గ‌లేదని ఈరోజు మీడియాతో అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాతే భూదందాలు మొద‌ల‌య్యాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 2004 వ‌ర‌కు భూదందాలు అంటూ ఇటువంటి సంఘ‌ట‌న‌లు ఏవీ జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. ఇక త‌మ‌పై ఆరోప‌ణ‌లు ఎలా చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాల‌ని కొంద‌రు కుట్రతో ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని, అందుకే త‌మ‌ను ఇందులో ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సందీప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐ లేదా జుడీషియ‌ల్ విచార‌ణ జ‌రిపించి అన్ని నిజాల‌ను బ‌య‌ట‌పెట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అంద‌రి విష‌యాలు బ‌య‌ట ప‌డాలంటే విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. కొంద‌రిని కాపాడేందుకు త‌మ‌పై కుట్ర చేస్తున్నార‌ని సందీప్‌రెడ్డి ఆరోపించారు. రాజ‌కీయ‌ప‌రంగా తమ‌ను దెబ్బ‌తీసేందుకే ఇటువంటి చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌ని ఆయ‌న అన్నారు. న‌యీమ్ కేసులో పెద్ద‌పెద్ద వ్య‌క్తుల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయని సందీప్‌రెడ్డి ఆరోపించారు.

More Telugu News