: ఇరోమ్ షర్మిలపై తీవ్ర విమర్శలు... నిలువ నీడలేని దయనీయ స్థితిలో తిరిగి ఆసుపత్రికి!

16 ఏళ్ల పాటు ముక్కులో నుంచి వెళ్లే ద్రవ పదార్థాలు మినహా మరే ఆహారాన్ని తీసుకోకుండా మొక్కవోని పట్టుదలతో దీక్షను చేసి మణిపూర్ రాష్ట్ర ప్రజల్లో ఉక్కు మహిళగా నిలిచిన ఈరోమ్ షర్మిల, ఇప్పుడు అదే ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. మణిపూర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను వెనక్కు తీసుకోవాలని ఆమె చేస్తున్న పోరును మధ్యలో నిలిపివేయడాన్ని మణిపూర్ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. గత 16 సంవత్సరాలుగా తానున్న ఆసుపత్రికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్నేహితురాలితో కలసి ఉండాలని నిర్ణయించుకున్న షర్మిల, కనీసం ఆ ప్రాంతానికి కూడా వెళ్లలేకపోయింది. కారణం స్థానికుల నుంచి వచ్చిన తీవ్ర నిరసనలే. సమీపంలోని ఇస్కాన్ దేవాలయాన్ని సంప్రదిస్తే, వారు సైతం షర్మిలకు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో షర్మిల దశాబ్దంన్నర పాటు తాను గడిపిన ఆసుపత్రికే తిరిగి వచ్చారు. అక్కడ హార్లిక్స్ ను నోటి ద్వారా తీసుకున్నారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, "ప్రజలు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను పోరాటాన్ని వదిలి పెట్టలేదు. కేవలం మార్గాన్ని మాత్రమే మార్చుకున్నాను. ప్రజలు అమాయక ప్రాణినైన తనపై ఇంత తీవ్రంగా స్పందిస్తారనుకోలేదు" అన్నారు. ఇక ఆమె కార్యాలయం బయట నిరసన ప్రదర్శనలు జోరందుకున్నాయి. "అమె తన యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసి వచ్చారు. పోరును ప్రారంభించిన ఆమే దాన్ని ముగించాలి. అలా జరుగకుంటే, ఆమె మాకు అక్కర్లేదు" అని నిరసన తెలుపుతున్న ఓ యువకుడు వ్యాఖ్యానించాడు. "తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్టు గడిపే హక్కు, వివాహం చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకునే హక్కు షర్మిలకు ఉన్నాయి. అయితే, ఎఫ్ఎస్పీఏ పై పోరాటాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేసి వెళ్లడం న్యాయం అనిపించుకోబోదు" అని ఓ గృహిణి వ్యాఖ్యానించారు. కాగా, షర్మిలకు నిలువనీడలేదని తెలుసుకున్న మణిపూర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మానవతా దృక్పథంతో ఆమె ఉండేందుకు చోటివ్వాలని నిర్ణయించింది.

More Telugu News