: నయీమ్ కేసులో కలకలం!... ఏ1గా నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి?

గడచిన నాలుగు రోజులుగా, తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు చెందిన వార్తలే తెలుగు నేలలో ప్రధాన వార్తా శీర్షికలవుతున్నాయి. నిన్నటిదాకా అతడి ఆస్తులు, గ్యాంగ్ ను అతడు నడిపిన తీరుపై ఆసక్తికర కథనాలు వెలువడితే... నేడు ఈ కేసులో మరింత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలున్నాయి. నయీమ్ కు అండగా నిలబడటమే కాకుండా... అతడు గ్యాంగ్ స్టర్ గా మారేందుకు తోడ్పాటునందించిన ఓ రాజకీయ నేత తెరపైకి వచ్చారు. నయీమ్ సొంత జిల్లా నల్లగొండ జిల్లాకే చెందిన సదరు రాజకీయవేత్త పేరు బయటకు రాకున్నా.. ఈ కోణంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... నయీమ్ కు అండగా నిలిచిన సదరు నేత గతంలో మంత్రిగానూ పనిచేశారట. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి చేరేందుకు అవకాశం కోసం ఆయన ఎదురుచూస్తున్నారట. మావోయిస్టుల చేతిలో తన కుటుంబ సభ్యుడిని కోల్పోయిన సదరు మాజీ మంత్రి... వారిపై కక్ష తీర్చుకునే క్రమంలోనే నయీమ్ ను వాడుకున్నట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. మొదట్లో చాలా కాలం పాటు నయీమ్ ఆ నేత ఇంటిలోనే ఉన్నాడట. ఈ క్రమంలో మావోయిస్టులతో పాటు పౌర హక్కుల సంఘం నేతలను మట్టుబెట్టించడంలోనూ ఆ నేత కీలక భూమిక పోషించారట. తాజాగా రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి, సదరు స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫునే బరిలోకి దిగేందుకు యత్నించారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ఓ ఎమ్మెల్యేపై నయీమ్ భారీ స్థాయిలో బెదిరింపులకు దిగాడు. హైదరాబాదులోని అలకాపురిలోని నయీమ్ ఇంటిలోని అతడి బెడ్ రూం తలుపులను బద్దలుకొట్టిన పోలీసులు ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నయీమ్ ఎక్కువ సార్లు ఫోన్ చేసింది కూడా సదరు నేతాశ్రీకేనట. మాజీ మంత్రి సెల్ ఫోన్ కే కాకుండా... ఆయన గారి ఇంటిలోని ల్యాండ్ లైన్ కు కూడా నయీమ్ చాలాసార్లు ఫోన్ చేశాడట. ఈ క్రమంలో ఈ కేసులో సదరు మాజీ మంత్రినే ఏ1గా చేర్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే... నయీమ్ అనుచరవర్గంలోని వారంతా సదరు నేతాశ్రీ అనుచరవర్గంలోని వారేనన్న విషయాన్ని కూడా పోలీసులు దాదాపుగా నిర్ధారించుకున్నట్లు సమాచారం.

More Telugu News