: సెంచరీల అంచున అశ్విన్, సాహా...లంచ్ సమయానికి టీమిండియా 316/5

వెస్టిండీస్ టూర్ మూడో టెస్టులో విండీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ తిరుగుటపాలా పెవిలియన్ చేరిన వేళ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (99), వికెట్ కీపర్ సాహా (93)తో కలిసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. స్పెషలిస్టు స్పిన్నర్ అయిన అశ్విన్... చేయితిరిగిన బ్యాట్స్ మన్ లా విండీస్ బౌలర్లను అడ్డుకున్నాడు. 257 బంతులాడిన అశ్విన్, కేవలం 5 ఫోర్ల సాయంతో 99 పరుగులు సాధించాడు. అశ్విన్ ను స్ఫూర్తిగా తీసుకున్నాడో లేక తాను స్పెషలిస్టు కీపింగ్ బ్యాట్స్ మన్ అని గుర్తుంచుకున్నాడో కానీ సాహా కూడా దీటుగా ఆడాడు. దీంతో 208 బంతులు ఎదుర్కొని 12 బౌండరీల సాయంతో 93 పరుగులు చేశాడు. వీరిద్దరి అద్భుత పోరాటపటిమ కారణంగా టీమిండియా రెండో రోజు ఆట లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. 234 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన అశ్విన్, సాహా విండీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, నెమ్మదిగా ఆడుకుంటూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఫస్ట్ సెషన్ తొలి భాగంలో డిఫెన్స్ కు ప్రాధాన్యమిచ్చిన వీరిద్దరూ సెకెండ్ హాఫ్ లో విరుచుకుపడ్డారు. దీంతో వన్డే లెవల్ లో కేవలం చివరి 12 ఓవర్లలో 61 పరుగులు పిండుకున్నారు. లంచ్ సమయానికి వీరిద్దరూ సెంచరీకి అడుగు దూరంలో నిలవడం విశేషం.

More Telugu News