: 200 లోపే ఆలౌట్ అవుతామని భావించా: లోకేష్ రాహుల్

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో 200 పరుగుల లోపలే టీమిండియా ఆలౌట్ అవుతుందని భావించానని వర్ధమాన క్రికెటర్ లోకేష్ రాహుల్ తెలిపాడు. అర్ధ సెంచరీతో రాణించిన లోకేష్ రాహుల్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ, బ్యాటింగ్ కు దిగగానే పిచ్ పరిస్థితి అర్థమైందని అన్నాడు. పిచ్ మందకొడిగా ఉండడంతో పరుగులు చేయడానికి, క్రీజులో పాతుకుపోయేందుకు చాలా కష్టంగా మారిందని అన్నాడు. దీంతో నిలకడగా ఆడాలంటే బౌలర్లపై ఒత్తిడి పెంచాలని భావించానని అందుకే బౌలర్లపై ఎదురుదాడికి దిగానని తెలిపాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఒత్తిడి పెంచాలన్న తన ప్రణాళికను పసిగట్టిన విండీస్ బౌలర్లు, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు సంధించి పరుగులు నియంత్రించి తనను ఇబ్బందిపెట్టారని రాహుల్ చెప్పాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో త్వర త్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ (75), వృద్ధిమాన్ సాహా (46) నిలదొక్కుకున్నారని అన్నాడు. 180-200 పరుగుల లోపే టీమిండియా ఆలౌట్ అవుతుందని తాను భావించానని చెప్పిన రాహుల్, తన అంచనాలు తప్పని నిరూపిస్తూ అశ్విన్, సాహా విలువైన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారని ప్రశంసించాడు. వారిద్దరి భాగస్వామ్యంతో మూడో టెస్టులో టీమిండియా తిరిగి కోలుకుందని చెప్పాడు. ఇకపై టీమిండియా టాప్ ఆర్డర్ జాగ్రత్తగా ఆడాల్సి ఉందని హితవు పలికాడు.

More Telugu News