: అన్ని రాష్ట్రాల్లాగే కశ్మీర్‌కూ సమాన స్వేచ్ఛ ఉంది... కశ్మీర్‌ కల్లోలంపై తొలిసారి పెదవి విప్పిన మోదీ

నెల రోజులుగా రావణకాష్టంలా రగులుతున్న కశ్మీర్‌పై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి పెదవి విప్పారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామమైన మధ్యప్రదేశ్‌లోని భాబ్రాను తొలిసారి సందర్శించిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతీ భారతీయుడు అనుభవించే స్వేచ్ఛ కశ్మీరుకూ ఉందన్నారు. క్రికెట్ బ్యాట్లు, ల్యాప్‌టాప్‌లు పట్టాల్సిన యువత రాళ్లు పట్టుకోవడం బాధాకరమన్నారు. కల్లోలానికి స్వస్తి పలికి కశ్మీర్‌ను అందమైన రాష్ట్రంగా, శాంతి సామరస్యాలు విలసిల్లేందుకు కృషి చేద్దామని పిలపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రస్తుత సమస్య పరిష్కారానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. మానవత్వం(హ్యుమానిటీ), ప్రజాస్వామ్యం(డెమోక్రసీ), కశ్మీరీ తత్వం(కశ్మీరీయట్) కోణాల్లో సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. కొందరు కావాలనే యువతను పెడదారి పట్టిస్తున్నారని, వాళ్ల చేతుల్లో రాళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలకు అభివృద్ధే సరైన పరిష్కారమన్న మోదీ దేశంలోని ప్రతీ భారతీయుడూ అనుభవిస్తున్న స్వేచ్ఛే కశ్మీరుకూ ఉందని స్పష్టం చేశారు. కశ్మీరులోని ప్రజలందరూ శాంతినే కోరుకుంటున్నారని, కానీ కొందరు పనిగట్టుకుని కశ్మీర్లో అల్లర్లు రేపుతున్నారని మోదీ పేర్కొన్నారు.

More Telugu News