: కశ్మీర్ సమస్య పరిష్కారంలో మానవీయత కరవైంది.. ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కల్లోలంగా మారిన కశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో మానవీయత కరవైందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. జస్టిస్ పీసీ ఘోస్, అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ‘‘సమస్య పరిష్కారం విషయంలో మానవీయత కరవైంది. ప్రేమాభిమానాలతో ప్రజల మనుసులు గెలిచి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. కానీ అది కనిపించలేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి’’ అని సూచించింది. గత నెల 8న ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అల్లర్లలో 55 మంది ప్రాణాలు కోల్పోగా మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. గత నెలరోజులుగా కశ్మీర్ ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు నెలరోజులుగా వేర్పాటు వాదులు బంద్ పాటిస్తూనే ఉన్నారు. కాగా కశ్మీర్ సమస్యపై తొలిసారి పెదవి విప్పిన ప్రధాని మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో మాట్లాడుతూ కొందరు కశ్మీర్‌కు హాని చేయాలని చూస్తున్నారని, వారి వలలో పడొద్దని కశ్మీర్ యువతకు సూచించారు. అభివృద్ధితో కశ్మీర్‌ను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

More Telugu News