: మాటలే!... చేతల్లేవ్!: మహిళల రక్షణపై కేజ్రీ సర్కారు తీరు బట్టబయలు!

దేశ రాజధానిలో శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యత మాదే... అన్న డిమాండ్ తో తొలి దఫా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేజేతులా కూల్చేసుకున్నారు. అయితే రెండో దఫా ఎన్నికలకు వచ్చిన ఆయనను ఢిల్లీ జనం విశ్వసించారు. మునుపటి కంటే అధిక సంఖ్యలో సీట్లిచ్చి అధికార పగ్గాలు అప్పగించారు. అయితే కేజ్రీవాల్ చేస్తున్నదేమిటి? ఇదే విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా ఆలోచించారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగిస్తే సరిపోతుందిగా అనుకున్న ఆయన... అనుకున్నదే తడవుగా ఓ దరఖాస్తు దాఖలు చేశారు. కేజ్రీ పాలనలో భాగంగా గతేడాది ఫిబ్రవరి 14 నుంచి ఈ ఏడాది జూన్ 9 వరకు... ఢిల్లీలో శాంతి భద్రతలు, మహిళల రక్షణపై కేజ్రీవాల్ ఎన్నిసార్లు సమీక్షా సమావేశాలు జరిపిందో తెలపాలంటూ ఆ దరఖాస్తులో ఆయన కోరారు. ఈ దరఖాస్తులకు కేజ్రీ కార్యాలయం (ఢిల్లీ సీఎంఓ) బదులు ఇవ్వక తప్పలేదు. తన దరఖాస్తుకు ఇటీవలే అందిన సమాధానాన్ని చూసి హరీశ్ ఖురానానే షాక్ తిన్నారట. మహిళా రక్షణ, ఢిల్లీలో శాంతి భద్రతలపై కేజ్రీ సర్కారు ఈ కాలంలో ఒక్కసారి కూడా భేటీ కాలేదట. అంతేకాదండోయ్... ఈ విషయాలపై సీఎం హోదాలో కేజ్రీవాల్... అటు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కాని, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షితో కాని ఒక్కసారి కూడా భేటీ కాలేదట. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న నజీబ్ జంగ్ తో కూడా కేజ్రీ భేటీ అయిన పాపాన పోలేదట. దీంతో కేజ్రీదంతా మాటల ప్రభుత్వమే కాని, చేతల ప్రభుత్వం కాదని హరీశ్ ఖురానా ఆరోపణలు గుప్పించారు.

More Telugu News