: హనీమూన్ కు ఒంటరిగా వెళ్లిన భర్త... భార్యనూ పంపుతానని సుష్మా స్వరాజ్ హామీ

నరేంద్ర మోదీ క్యాబినెట్ లో సమర్థవంతమైన మంత్రిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వారి కష్టాలను తీర్చడంలో ముందు నిలుస్తున్నారు. తాజాగా, తన దృష్టికి వచ్చిన ఓ ఆసక్తికరమైన సమస్యపై ఆమె స్పందించారు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తయినా తన భార్యతో కలసి హనీమూన్ కు వెళ్లాలని అనుకుంటారు. కానీ, ఇక్కడ జరిగింది దానికి విరుద్ధం. ఫైజాన్ పటేల్ అనే వ్యక్తికి ఇటీవల సనా అనే యువతితో వివాహం జరుగగా, హనీమూన్ నిమిత్తం యూరప్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. టికెట్లు బుక్ చేసుకున్నాడు. ప్రయాణ సమయం వచ్చేసరికి సనా పాస్ పోర్టు కనిపించలేదు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఎవరైనా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. కానీ ఫైజాన్ అలా చేయలేదు. విమానం ఎక్కేసి, తన భార్య కూర్చోవాల్సిన సీటులో ఆమె ఫోటోను పెట్టి, ఓ సెల్ఫీ దిగి సుష్మా స్వరాజ్ కు ట్వీట్ పెట్టాడు. తన పరిస్థితిని వివరించి, సాయం చేయాలని కోరాడు. ఆ వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి, రీ ట్వీట్ చేస్తూ, "నన్ను కాంటాక్ట్ కమ్మని నీ భార్యకు చెప్పు. నీ పక్క సీట్లో ఆమె కూర్చునేలా నేను చూస్తాను" అని సమాధానం ఇచ్చారు. ఆపై తన కార్యాలయం ఇప్పటికే డూప్లికేట్ పాస్ పోర్టును సిద్ధం చేసిందని, నేడే అది సనా చేతికి అందిస్తామని మరో ట్వీట్ పెట్టారు.

More Telugu News