: దేశంలో లక్ష స్కూళ్లలో ఒకరే టీచర్.. ఆంధ్రాలోనూ వన్ మ్యాన్ షోనే!

దేశంలోని విద్యారంగంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సోమవారం పార్లమెంటుకు వచ్చిన ఓ నివేదిక భారతదేశ విద్యావ్యవస్థ దీనస్థితిని చెప్పకనే చెబుతోంది. దేశంలోని 1,05,630 ప్రభుత్వ ఎలిమెంటరీ, సెకండరీ పాఠశాలలు ఒక్కరంటే ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని నివేదిక తేల్చి చెప్పింది. ఈ విషయంలో మధ్యప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌దీ అదే దారి అని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో 17,874 స్కూళ్లకు ఒక్క ఉపాధ్యాయుడే దిక్కు కాగా ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 17,602 స్కూళ్లు సింగిల్ టీచర్‌తోనే నెట్టుకొస్తున్నాయి. రాజస్థాన్(13,575), ఆంధ్రప్రదేశ్(9,540), జార్ఖండ్(7,391)లు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ఆ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు అన్ని తరగతులకు క్లాసులు బోధిస్తూ నిత్యం వివిధ పాత్రలు పోషిస్తున్నట్టు నివేదిక తేల్చి చెప్పింది. 2014-15కు సంబంధించిన వార్షిక నివేదికను మానవ వనరుల మంత్రిత్వ శాఖ(హెఆర్డీ) మంత్రి ఉపేంద్ర కుష్వారా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సింగిల్ టీచర్ లేని స్కూలు దేశంలో ఒక్కటి కూడా లేదని నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయంలో కేంద్రపాలిత ప్రాంతాలు చాలా మెరుగైన స్థానంలో ఉన్నాయి. డామన్ అండ్ డయ్యు, పాండిచ్చేరి, చండీగఢ్, లక్ష్వదీప్‌లలో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లు లేకపోవడం గమనార్హం. కాగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇటువంటి స్కూళ్లు 13 ఉండడం గమనార్హం.

More Telugu News