: న‌కిలీ గోర‌క్ష‌కుల‌ను ఈ వేదిక‌నుంచే హెచ్చ‌రిస్తున్నా... మీ ఆటలు కట్టిపెట్టండి: మెద‌క్‌లో మోదీ

తల్లి త‌రువాత‌ మ‌ళ్లీ అంత‌టి ప‌విత్ర‌మ‌యినది ఆవు అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ అన్నారు. మెద‌క్ జిల్లా గ‌జ్వేల్‌లోని కోమ‌టిబండ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ఆలమంద ఉంటే మ‌న సంప‌ద పెరిగిన‌ట్టేన‌ని వ్యాఖ్యానించారు. ‘కొంద‌రు భార‌తీయ స‌మాజాన్ని విడ‌దీయాల‌నుకుంటున్నారు. గోర‌క్ష పేరుతో ప్ర‌జ‌ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు సృష్టించాల‌ని చూస్తున్నారు. కొంద‌రు చేస్తున్న ఈ ప‌నిని బ‌ట్ట‌బ‌య‌లు చేద్దాం. ఆవును వ్య‌వసాయంతో అనుసంధానం చేయండి’ అని అన్నారు. ‘న‌కిలీ గోసంర‌క్ష‌కులంద‌రికీ ఈ వేదికపై నుంచే హెచ్చ‌రిక జారీ చేస్తున్నా.. మీ ఆట‌లు క‌ట్టిపెట్టండి. ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టించేవారి ప‌ట్ల క‌ఠినంగా వ్యవ‌హ‌రించాల‌ని రాష్ట్ర‌ప్రభుత్వాల‌ను కోరుతున్నా. కొంద‌రు న‌కిలీ గోసంర‌క్ష‌కుల పేరుతో చేస్తోన్న ఈ చ‌ర్య‌ల‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేద్దాం. న‌కిలీ గోర‌క్ష‌కుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి. వారిని స‌మాజం నుంచి వెలివేయండి’ అని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజ‌ల‌కు హైద‌రాబాద్ ఎంతో ఢిల్లీ కూడా అంతేన‌ని మోదీ అన్నారు. మ‌న‌దంతా ఒక‌టే భాష.. అదే అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య మంచి వాతావ‌ర‌ణం ఉండాల‌ని ఆయ‌న అన్నారు. అంతా క‌లిసి దేశాభివృద్ధికి కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పుడు ఎక్క‌డా ఎరువుల కొరత లేద‌ని ఆయ‌న అన్నారు. గ‌జ్వేల్‌లో ప్ర‌సంగించిన అనంత‌రం మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు బ‌య‌లుదేరారు.

More Telugu News