: ఒకవేళ అమెరికాపై దాడి జరిగితే.. జపనీయులు సోనీ టీవీ వీక్షిస్తూ కూర్చుంటారు!: మిత్రదేశంపై ట్రంప్ ఘాటు వ్యాఖ్య!

అమెరికా విదేశీ సంబంధాలపై ఆ దేశ అధ్యక్ష పదవి రేసులోకి దిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అమెరికా వలస విధానంపై పలు విమర్శలు గుప్పించిన ట్రంప్... తాజాగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న జపాన్ పై నోరు పారేసుకున్నారు. అమెరికాపై దాడి జరిగితే... జపనీయులు మాత్రం సోనీ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని లోవాలో జరిగిన సభలో మాట్లాడిన సందర్బంగా ట్రంప్... జపాన్ పై విరుచుకుపడ్డారు. నాటో సభ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల భద్రతకు అమెరికా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నప్పటికీ ఆ దేశాలు... అమెరికాకు ఎంతమాత్రం అండగా నిలబడటం లేదని ఆరోపించారు. ఇప్పటికీ జపాన్ లో అమెరికాకు చెందిన 47 వేల బలగాలున్నాయని చెప్పిన ట్రంప్... ఈ ఖర్చు మొత్తాన్ని అమెరికానే భరిస్తోందన్నారు. ఇందులో సింగిల్ పైసాను కూడా జపాన్ భరించడం లేదన్నారు. ఇప్పటికైనా జపాన్ తన వైఖరిని మార్చుకోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు.

More Telugu News