: ఛోటా రాజన్‌పై పుస్తకం రాయాలనుకున్నందుకే జర్నలిస్ట్‌ జే డేను హత్యచేశారు: స్పష్టం చేసిన సీబీఐ

జర్నలిస్ట్‌ జే డే హత్యకు గురయిన ఘటనలో అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌పై సీబీఐ అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2011 జూన్‌లో ఆయ‌న‌ను కొంద‌రు దుండ‌గులు కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. దీనిపై విచారణ చేప‌ట్టిన సీబీఐ ఛార్జిషీటులో మొత్తం 41 మంది సాక్షుల వాంగ్మూలాన్ని తీసుకుంది. వాటి ఆధారంగా జే డే హ‌త్య‌కు సంబంధించిన‌ ప‌లు విష‌యాలను తాజాగా వివ‌రించింది. ఛోటా రాజన్‌పై ఆయ‌న ప‌లు ఆర్టిక‌ల్స్ రాశార‌ని, పుస్తకం కూడా రాయాలనుకున్నారని, అందుకే దుండ‌గులు ఆయ‌న‌ను హ‌త్య చేశార‌ని సీబీఐ స్ప‌ష్టం చేసింది. పోలీసుల‌ని ముప్పుతిప్పలు పెట్టిన ఛోటా రాజన్ చివ‌ర‌కు ఇండోనేషియాలో పట్టుబడిన సంగ‌తి విదిత‌మే. ఆయనపై మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టులో ఇప్పటికే 300 పేజీల ఛార్జిషీటు పెట్టారు. జే డే హ‌త్య కేసులో ఇప్పుడు రాజన్‌పై మరో ఛార్జిషీటు దాఖ‌లైంది. జర్నలిస్ట్‌ జే డే ‘చిండి-రాగ్స్‌ టు రిచెస్‌’ అనే పేరుతో చోటా రాజన్‌తో పాటు 20 మంది గ్యాంగ్‌స్టర్ల గురించి పుస్తకం ర‌చించ‌డానికి సిద్ధమయ్యారు. అంతేగాక‌, ఆయ‌న జ‌ర్న‌లిజాన్ని వీడ‌డానికి ముందే మ‌రో రెండు పుస్త‌కాలు ర‌చించాల‌నే ఉద్దేశంతో వాటి కోసం ఫిలిప్పీన్స్ తో పాటు ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించారు. అయితే, చోటా రాజ‌న్.. డేను ఓసారి క‌ల‌వాల‌నుకున్నాడు. మ‌లేషియాలో చోటా రాజ‌న్ ఉన్న‌ప్పుడు ఆయన డేను క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేశాడని, అయితే డే అందుకు ఒప్పుకోలేద‌ని సీబీఐ తెలిపింది.

More Telugu News