: భారత్ లోని ఐఎస్ సానుభూతిపరులకు కువైట్ వాసి ఆర్థిక సాయం!... అరెస్ట్ చేసిన కువైట్ పోలీసులు!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు ఆర్థిక వనరులు అందిస్తూ ఓ కువైట్ వాసి అడ్డంగా దొరికిపోయాడు. నేరుగా ఐఎస్ కు నిధులందిస్తున్నారో, లేదో తెలియదు కాని... భారత్ నుంచి ఐఎస్ లో చేరేందుకు వెళుతున్నవారికి మాత్రం అతడు నిధులు అందిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన కువైట్ పోలీసులు తమ దేశానికి చెందిన అబ్దుల్లా హాదీ అబ్దుల్ రెహ్మాన్ ఆల్ ఎనేజీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2014లో భారత్ నుంచి ఇరాక్ వెళ్లిన మహారాష్ట్ర వాసి అరీబ్ మాజిద్ ఐఎస్ లో చేరిపోయాడు. ఆ తర్వాత తిరిగివచ్చిన అతడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న అతడు పలు కీలక వివరాలు వెల్లడించాడు. ఇరాక్ ఉన్న సమయంలో తనతో పాటు తన ముగ్గురు మిత్రులకు అబ్దుల్లా వెయ్యి డాలర్ల చొప్పున అందజేశాడని అరీబ్ చెప్పాడు. దీంతో ఈ సమాచారాన్ని కువైట్ కు అందజేసిన ఎన్ఐఏ అబ్దుల్లాను అరెస్ట్ చేయించింది.

More Telugu News