: రూ.100 లంచం ఇచ్చేందుకు నిరాకరించిన యువకులు... కొట్టి చంపిన పోలీసులు!

ఉత్తరప్రదేశ్‌లో దారుణాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఇటీవల రూ.15 అప్పు కోసం దళిత దంపతులను ఓ దుకాణదారు కొట్టి చంపేశాడు. మరో ఘటనలో పోలీసుల కస్టడీలో ఉన్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ వేడి ఇంకా చల్లారకముందే అటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. వంద రూపాయలు లంచం ఇచ్చేందుకు నిరాకరించిన ఇద్దరు యువకులను పోలీసులు దారుణంగా కొట్టి చంపేశారు. మెయిన్‌పురి జిల్లాలోని ఓ చెక్‌పాయింట్ వద్ద ఈ దారుణం జరిగింది. దిలీప్ యాదవ్(22), పంకజ్ యాదవ్(24) ఇద్దరూ కజిన్స్. మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఓ ట్రక్కులో ఇటుకలు తీసుకెళ్తున్నారు. ఘిరోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్మా చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఈ ట్రక్కును అడ్డుకున్నారు. విడిచిపెట్టాలంటే వంద రూపాయలు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ట్రక్కు డ్రైవర్ వినేష్ పోలీసులకు ఎదురు తిరిగాడు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు. ఘర్షణ పెద్దది కావడంతో కార్మికులు నెట్రాపాల్, రాధామోహన్ అక్కడి నుంచి పారిపోయారు. దీంతో చేతికి చిక్కిన దిలీప్, పంకజ్‌లను పోలీసులు చితకబాదారు. దెబ్బలకు తట్టుకోలేని వారిద్దరు మృతి చెందారు. విషయం తెలిసిన గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్కడకొచ్చిన ఇద్దరు పోలీసులను చితకబాదారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని నినదించారు. ఈ మేరకు పోలీసులపై కేసులు నమోదు చేశారు. దీంతో స్పందించిన ఎస్పీ ఈ ఘటనలో ప్రమేయమున్నట్టుగా భావిస్తున్న ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. పోలీసులను చూసి పారిపోయి ఓ చెరువులో పడి దిలీప్, పంకజ్ మృతి చెందారని పోలీసులు మొదట నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో వారి శరీరంపై గాయాలు ఉండడం, గాయాల కారణంగానే వారు మృతి చెందినట్టు తేలడంతో పోలీసుల కర్కశత్వం బయటపడింది.

More Telugu News