: ఏపీకి మరో ప్రాజెక్టు... మెగా ఫుడ్ పార్కును ప్రకటించిన మోదీ సర్కారు

భారత ఆహార రంగంలో ఎగుమతి, దిగుమతి వాణిజ్యాన్ని మరింతగా పెంచాలన్న లక్ష్యంతో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో రెండు భారీ ఫుడ్ పార్క్ ప్రాజెక్టులను ప్రకటించింది. రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ పార్క్ లను ప్రతిష్ఠాత్మక సాగరమాల ప్రాజెక్టు కింద చేపట్టనున్నట్టు నౌకాయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "నౌకాయాన శాఖ చేపట్టిన సాగరమాల ప్రాజెక్టులో భాగంగా రెండు మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయనున్నాం. తీరానికి దగ్గరగా ఉన్న సెజ్ లలో ఇవి ఉంటాయి. ఏపీలోని కాకినాడ ప్రాంతంలో ఇది ఏర్పాటవుతుంది మహారాష్ట్రలో దక్షిణాన కొంకణ్ రీజియన్ లో సతారా మెగా ఫుడ్ పార్క్ పేరిట ఏర్పాటు చేయనున్నాం" అని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో ఏర్పడే ఏపీ మెగా ఫుడ్ పార్క్ నుంచి కాకినాడ ఓడరేవు ద్వారా విదేశాలకు ఎగుమతులు చేసే ఆలోచనలో ఉన్నామని వివరించింది. ఏపీలో ప్రాజెక్టుకు రూ. 184.88 కోట్లు వ్యయమవుతాయన్న అంచనాలు ఉన్నాయని, మహారాష్ట్ర ప్రాజెక్టుకు 139.33 కోట్లు కేటాయించామని తెలిపింది. ఇండియాలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్న వేళ, ఈ రెండు ప్రాజెక్టులూ ప్రజల అవసరాలను తీర్చేందుకు దోహదపడతాయని, భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

More Telugu News