: దళిత యువకుడిని కొట్టి చంపిన పోలీసులు, స్టేషన్ లోని మొత్తం 14 మందీ సస్పెన్షన్

ఓ దొంగతనం కేసులో అరెస్ట్ చేసి తీసుకువచ్చిన దళిత వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీసు స్టేషన్ లో మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కమల్ వాల్మీకి (25) అనే యువకుడు లాకప్ లో మరణించాడు. అతను ఉరి వేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా, పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తూ, ఆయన బంధువులు, దళిత సంఘాలు నిరసనలకు దిగాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన అఖిలేష్ ప్రభుత్వం ఆ స్టేషన్ లో పని చేస్తున్న మొత్తం 14 మంది సిబ్బందినీ సస్పెండ్ చేసింది. ఓ పోలీసుపై హత్య కేసును కూడా పెట్టి దళితుల నుంచి పెల్లుబికిన ఆగ్రహాన్ని చల్లార్లేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ కాన్పూర్ లో నిరసనలు తగ్గలేదు. ఆందోళనకారులు పోలీస్ పోస్టుపై దాడి చేసి రాళ్లు రువ్వారు. కాగా, వాల్మీకి మరణించిన తరువాత ఆయన పేరును రాజూ మిస్త్రీగా పేర్కొంటూ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పంపగా, అలా ఎందుకు జరిగిందన్న విషయమై సరైన సమాధానం పోలీసుల నుంచి రాలేదు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో దళితుల మరణాలు పెరుగుతుండటం, వారిపై దాడుల ఘటనలు మరోసారి అధికారంలోకి రావాలని సీఎం అఖిలేష్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలేనని రాజకీయ పరిశీలకులు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలను యూపీ దళిత వర్గం నేతగా మాయావతి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

More Telugu News