: ఖైదీగా వచ్చాడు... జైలును ఖరీదైన హోటల్ గా మార్చేశాడు!

డబ్బుంటే కొండమీద కోతైనా దిగివస్తుందని బ్రైజిల్ కు చెందిన డ్రగ్ డీలర్ జార్విస్ చిమెన్స్ పవావో నిరూపిస్తున్నాడు. ఏడేళ్ల క్రితం డ్రగ్స్ తరలిస్తూ పవావో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతనికి న్యాయస్థానం 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పరాగ్వే రాజధాని అసిన్సిన్ కారాగారానికి అతనిని తరలించారు. అయితే, ఈయనగారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడనుకుంటే పొరపాటే... ఎందుకంటే, ఏకంగా జైలునే తన అభిరుచికి తగ్గట్టుగా మార్చేశాడు. బ్రెజిల్ లో కొకైన్ కింగ్ గా పరిచితుడైన జార్విస్ అత్యంత సంపన్నుల్లో ఒకడు. దాంతో జైలు సిబ్బందికి కావలసినన్ని డబ్బులు పారేసి తనవాళ్లుగా మార్చేసుకున్నాడు. ఇంకేం.. అతనికి జైలు ఇప్పుడు స్టార్ హోటల్ లా అయిపోయింది. మూడు అటాచ్డ్ రూమ్స్ ను అధికారులు కేటాయించారు. బోర్ కొడితే ఎంటర్ టైన్మెంట్ కోసం పెద్ద ప్లాస్మా టీవీతో కూడిన గది, సహచరులు, విజటర్స్ తో సమావేశాలు నిర్వహించుకునేందుకు ఓ సెమినార్ హాలు, స్టార్ హోటల్ లాంటి బెడ్... మరీ బోర్ కొడితే చదువుకునేందుకు అల్మరాల నిండా పుస్తకాలు. నచ్చినప్పుడు వంట చేసుకునేందుకు అన్ని హంగులు కలిగిన వంటగది. ఇదీ... అతని జైలు జీవితం స్టైలు. జైలును ఇలా తయారు చేసేందుకు అధికారులకు తాయిలాలిచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సిబ్బందిని బాగా మేనేజ్ చేశాడు. వాళ్లకు జీతాలు పెంచేలా చేశాడు. గిఫ్టులిచ్చాడు. తోటి ఖైదీలు ఇబ్బంది పెట్టకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాడు. దీంతో ఈ జైలులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 2017తో అతని శిక్ష ముగియనుండగా, తనిఖీలు చేసిన ఉన్నతాధికారులు అతని గదిలో సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. దీనిపై పవావో లాయర్‌ మాట్లాడుతూ, పవావో వల్ల జైలులో సదుపాయాలు మెరుగయ్యాయని అన్నారు. ఆయనతో పాటు ఆయన తోటి ఖైదీలు కూడా హాయిగా జీవిస్తున్నారని ఆయన తెలిపారు. తోటి ఖైదీలు మాట్లాడుతూ, పవావో ఉండటం వల్ల జైలులో సమస్యలు తీరాయని పేర్కొన్నారు. సిబ్బంది జీతాలు పెరగడంలోనూ పవావో పాత్ర ఉందని పేర్కొన్నారు. దీంతో శిక్ష అనుభవించాలని జైలుకి పంపితే జైలునే స్వాధీనం చేసుకున్నాడని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

More Telugu News