: ఇకపై 'పశ్చిమ బెంగాల్' కాదు... బెంగాల్... పేరు మార్పుకు రాష్ట్ర కేబినేట్ ఓకే!

పశ్చిమ బెంగాల్‌ పేరు ఇకపై బెంగాల్‌ గా మారనుంది. బ్రిటిష్‌ కాలంలో బెంగాల్‌ ప్రావిన్స్‌ ను హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాన్ని వెస్ట్‌ బెంగాల్‌ గాను, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఈస్ట్‌ బెంగాల్‌ గాను విభజించారు. తదనంతర కాలంలో ఈస్ట్‌ బెంగాల్‌ పాకిస్థాన్ లోకి వెళ్లింది. ఆ తర్వాత అది పాక్ నుంచి విడిపోయి, బంగ్లాదేశ్‌ గా ఏర్పడింది. భారత్‌ లోనే ఉన్న వెస్ట్‌ బెంగాల్‌ ను వెస్ట్‌ బెంగాల్‌ అని సంబోధిస్తున్నారు. దీంతో భారత్ లో ఉన్న ఏకైక బెంగాల్ ను వెస్ట్ బెంగాల్ అని సంబోధించాల్సిన అవసరం లేదన్న వాదన ఉన్నప్పటికీ, దానిని బెంగాల్ గా ప్రకటించే దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ నేపధ్యంలో పేరు మార్పు ప్రతిపాదనపై ఆ రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీంతో వెస్ట్‌ బెంగాల్‌ ను ఇకపై ఇంగ్లీషులో బెంగాల్‌ గాను, బెంగాలీ భాషలో అయితే ‘బంగ్లా’ లేదా ‘బంగా’ గా పిలవాలని నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం పొందిన ప్రతిపాదనను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు అక్కడ ఆమోదం పొందితే...ఈ ప్రతిపాదన కేంద్రానికి చేరనుంది. దీంతో లాంఛనం ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ కి అసెంబ్లీలో అవసరమైన దానికంటే ఎక్కువ మెజారిటీ ఉంది కనుక రాష్ట్రం పేరు బెంగాల్ గా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే కలకత్తా మహానగరం పేరును కోల్ కతాగా మార్చిన సంగతి తెలిసిందే.

More Telugu News