: 'మై నేమ్ ఈజ్ ఖాన్...' అంటూ ట్రంప్ ను హడలెత్తిస్తున్న ఆర్మీ కుటుంబం!

అమెరికా అధ్యక్ష రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసుకు అందరూ జడుసుకుంటున్న వేళ... ఒకే ఒక్క ముస్లిం కుటుంబ ప్రచారం ట్రంప్ ను బెంబేలెత్తిస్తోంది. 'ముస్లింలను అమెరికాలో అడుగు పెట్టనివ్వను, మెక్సికోకు అడ్డంగా గోడకడతా' అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకున్నాయి. ఆయన దూకుడుకు ప్రతిగా డెమెక్రాట్లు ఇరాక్ లో అమెరికా సైన్యం తరపున తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ మేజర్ హుమయూన్ ఖాన్ తల్లిదండ్రులు ఖిజర్ ఖాన్, గజాలా ఖాన్ లను రంగంలోకి దించారు. దీంతో వారిద్దరి మాటలు క్షిపణుల్లా ట్రంప్ కు తగులుతున్నాయి. 'మై నేమ్ ఈజ్ ఖాన్ అండ్ అయామ్ ఏన్ అమెరికన్ పేట్రియాట్' (నా పేరు ఖాన్, నేను అమెరికా దేశభక్తుడిని) అంటూ ఆ తల్లిదండ్రులు నినదించిన విధానం ట్రంప్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. డెమొక్రాటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌ లో ఖిజర్ ఖాన్ మాట్లాడిన తరువాత ట్రంప్ స్పందించిన తీరు ఆయనపై అమాంతం వ్యతిరేకతను పెంచింది. రిపబ్లికన్ సెనేటర్ జాన్ మెక్‌ కెయిన్ స్పందింస్తూ ట్రంప్ వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదిస్తున్నానని తెలిపారు. ట్రంప్ భావాలు, వ్యాఖ్యలతో తమ పార్టీకి, నేతలకు, అభ్యర్థులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వివిధ దేశాల నుంచి మీలాంటి వారు రావడం వల్లే అమెరికా అత్యుత్తమంగా తయారైందని అంగీకరించిన ఆయన, మేజర్ హుమయూన్ ఖాన్ చేసిన త్యాగాన్ని అమెరికా ఎప్పటికీ మరచిపోదని పేర్కొన్నారు. హౌస్ స్పీకర్ పాల్ రియాన్ కూడా ట్రంప్‌ వ్యాఖ్యలతో విభేదించారు. కాగా, హౌస్ నుద్దేశించి ఖిజర్ ఖాన్ మాట్లాడినప్పుడు గజాలా ఖాన్ మౌనంగా ఉన్నారు. దీంతో సాధారణ ముస్లిం కుటుంబాల్లోలా ఆమె అణిచివేతకు గురవుతోందంటూ ట్రంప్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె కూడా వివిధ న్యూస్ ఛానెళ్లతో మాట్లాడారు. దీంతో ట్రంప్ తోకముడవాల్సి వచ్చింది. ఉన్నత విద్యావంతులైన వారు ట్రంప్ కు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మిత్రదేశాలుగా ఉన్న ముస్లిం దేశాలతో కూడా శత్రుత్వం పెట్టుకుంటారా? ఇప్పుడు వివిధ స్థానాల్లో ఉన్న ముస్లింలను విధుల నుంచి తప్పించి, వారిని ఎక్కడికి పంపిస్తారు? ఎందుకీ అభద్రతా భావం...మీలో ఉన్న అభద్రతా భావాన్ని, అపరిపక్వతను అమెరికా ప్రజల్లోకి ఎక్కించాలని భావిస్తున్నారా? అంటూ ఉన్నత విద్యావంతులైన హుమయూన్ ఖాన్ తల్లిదండ్రులు వేసిన ప్రశ్నలకు ట్రంప్ కోట బీటలు వారింది. సొంత పార్టీలో ఆయనకు వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. దీంతో ట్రంప్ మాట్లాడుతున్న మాటలు ఆయన మానసికంగా ఓటమికి సిద్ధమయ్యారన్న సందేశాన్ని ఇస్తున్నాయి.

More Telugu News