: ‘కూలీ’ చిత్రంలోని ఆ సీన్ ను నేను ఇంట్లో ప్రయత్నిస్తుండేవాడిని: అభిషేక్ బచ్చన్

‘కూలీ’ చిత్రంలో తన తండ్రి దుప్పటి కప్పుకునే సీన్ ను ఇంట్లో చేసేందుకు తాను ప్రయత్నిస్తుండేవాడినని చెబుతూ, అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. 1982 లో అమితాబ్ ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు జులై 26వ తేదీన ఆయన తీవ్ర ప్రమాదానికి గురికావడం, కొన్ని నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవడం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించడంతో, ఆగస్టు 2వ తేదీ నాటికి విషమపరిస్థితి నుంచి అమితాబ్ బయటపడ్డారు. ఆ తర్వాత క్రమంగా కోలుకుని కూలీ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. అందుకే, ఆగస్టు 2వ తేదీ అమితాబ్ కు పునర్జన్మ లాంటింది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు అమితాబ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్ట్ లు చేశారు. ఈ పోస్ట్ లకు బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో చేసిన ఒక పోస్ట్ లో ‘కూలీ’ చిత్రానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘కూలీ’ చిత్రంలో అమితాబ్ దుప్పటి కప్పుకునే సీన్ ను తాను కూడా ఇంట్లో చేస్తుండేవాడినని, ‘కూలీ’లో అమితాబ్ పోషించిన ఇక్బాల్ పాత్రను తాను పోషిస్తే, తన స్నేహితుడు జాఫర్ ఖాన్ గా నటించేవాడని చెప్పాడు. తన మిత్రుడి చేతికి ప్లాస్టిక్ గన్ ఇచ్చి తనను షూట్ చేయమని అడిగేవాడినని గుర్తు చేసుకున్న అభిషేక్, ‘హ్యాపీ బర్త్ డే పా... నువ్వే నా స్ఫూర్తి’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

More Telugu News