: యూనివర్సిటీలో రక్షణ కోసం తుపాకులు ఉంచుకోవచ్చు.. టెక్సాస్ సంచలన నిర్ణయం

అమెరికాలోని టెక్సాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు తుపాకులు దాచుకోవచ్చని పేర్కొంది. యూనివర్సిటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడి 50 ఏళ్లు కావడంతో ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో యూనివర్సిటీల్లో తుపాకులు దాచుకోవడాన్ని అనుమతిస్తున్న ఎనిమిదో రాష్ట్రంగా టెక్సాస్ అవతరించింది. యూనివర్సిటీలోకి తుపాకులు అనుమతించడానికి సంబంధించిన చట్టాన్ని గతేడాది ఆమోదించారు. దీని ప్రకారం టెక్సాస్‌లోని ప్రైవేటు యూనివర్సిటీలు క్యాంపస్ బిల్డింగులలో తుపాకులు దాచుకోవచ్చు. అయితే ఈ విషయంలో స్కూళ్లపై మాత్రం కొన్ని నిబంధనలు విధించారు. 1966లో ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి యాభై ఏళ్లు కావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా యూనివర్సిటీలో తుపాకులు దాచుకోవడాన్ని చట్టబద్ధం చేసిన ఇతర రాష్ట్రాల్లో ఓరెగాన్, కొలరాడో, విస్కన్సిన్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో టెక్సాస్ కూడా అందులో చేరింది. 18 రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో నిషేధం విధించాయి.

More Telugu News