: 'వేదశక్తి'తో 'దంతకాంతి'పై యుద్ధానికి దిగిన కోల్గేట్!

యోగా గురువు రాందేవ్ బాబా మార్కెట్లోకి వదిలిన హెర్బల్ టూత్ పేస్టు 'దంతకాంతి'ని ఎదుర్కొనేందుకు 'కోల్గేట్ పామోలివ్' సరికొత్త బ్రాండ్ టూత్ పేస్టు 'వేదశక్తి'ని రంగంలోకి దించింది. దాదాపు 80 సంవత్సరాలుగా భారత ఓరల్ కేర్ సెగ్మెంట్ లో అత్యధిక మార్కెట్ వాటాను నమోదు చేస్తూ వచ్చిన కోల్గేట్ బ్రాండ్, పంతంజలి ఉత్పత్తుల రాకతో అమ్మకాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. తగ్గుతున్న మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు తాము కూడా హెర్బల్ టూత్ పేస్టును విక్రయించాలని నిర్ణయించిన కోల్గేట్ పామోలివ్, వేదశక్తిని విడుదల చేయడం ద్వారా ఎఫ్ఎంసీజీ రంగంలో సరికొత్త యుద్ధానికి తెరలేపింది. ఇప్పటికే మార్కెట్లో పరిచయం ఉన్న 'సిబాకా' బ్రాండ్ కింద 'వేదశక్తి' అమ్మకాలు ప్రారంభిస్తామని కోల్గేట్ స్పష్టం చేసింది. దేశంలో సగానికి పైగా ఓరల్ కేర్ మార్కెట్ వాటాతో 16 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.10 లక్షల కోట్లు)కు పైగా విస్తరించిన కోల్గేట్ బ్రాండు నుంచి ఆయుర్వేద ప్రొడక్టు రావడం ఇదే తొలిసారి. "ఇండియాలోని ప్రజలు ప్రకృతిలో సహజంగా లభించే వనమూలికలతో తయారైన ప్రొడక్టులను కోరుకుంటున్నారు. ఈ తరహా ఉత్పత్తులైతే తమ ఆరోగ్యం పదిలమని వారు భావిస్తున్నందునే మా సబ్ బ్రాండ్ సిబాకా గొడుగుకింద వేదశక్తిని పరిచయం చేస్తున్నాం" అని కోల్గేట్ పామోలివ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బినా థాంప్సన్ వెల్లడించారు. ప్రస్తుతం భారత మార్కెట్లో హెర్బల్ టూత్ పేస్టు వాటా 13 నుంచి 14 శాతంగా ఉందని ఆయన అన్నారు. కాగా, టూత్ పేస్టుకు వేదశక్తి అని పేరు పెట్టడాన్ని పతంజలి ఆయుర్వేద సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. "ఇండియాలో వేదాలను పూజిస్తాం. వాటిని మనం వాడే ఉత్పత్తులకు జోడించకూడదు. కోల్గేట్ చర్య భారత సంస్కృతిపై ప్రత్యక్షదాడే. ఈ ప్రొడక్టును ఎవరూ కొనుగోలు చేయవద్దు" అని పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ కోరారు.

More Telugu News