: రాజ్‌నాథ్ సింగ్‌ పర్యటన నేపథ్యంలో పాకిస్థాన్‌కు హిజ్బుల్ చీఫ్ హెచ్చరిక

హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాఉద్దీన్ పాకిస్థాన్‌ని తీవ్రంగా హెచ్చ‌రించారు. ఉగ్రవాదం, పైరసీ, నల్లమందు, మహిళలు, పిల్లల అక్రమ రవాణా తదితర అంశాలు ముఖ్య అజెండాగా ఇస్లామాబాద్‌లో జ‌ర‌గ‌నున్న‌ దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) హోంమంత్రుల సదస్సులో భారత హోంమంత్రి రాజ్‌నాథ్‌ పాల్గొన‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో సయ్యద్ సలాఉద్దీన్ స్పందిస్తూ రాజ్‌నాథ్ సింగ్‌ను ఆ దేశంలోకి ఆహ్వానించ‌వ‌ద్దంటూ డిమాండ్ చేశారు. క‌శ్మీర్‌లో రాజ్‌నాథ్ సింగ్ బ‌ల‌గాల‌ను మోహ‌రింప‌జేసి అక్క‌డి అమాయక ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతూ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. భార‌త హోం మంత్రిని పాక్‌లోకి అనుమ‌తిస్తే తాము సహించబోమ‌ని సయ్యద్ సలాఉద్దీన్ హెచ్చరించారు. దీనిపై పాక్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి స్పంద‌న లేదు. కాగా, సార్క్ స‌మావేశంలో రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్ నేతల మధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌బోవ‌ని భార‌త్ ఇప్ప‌టికే తేల్చిచెప్పింది. అయితే, భారత్‌లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే అంశాన్ని మానుకోవాల‌ని పాక్‌కి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞ‌ప్తి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News