: మదర్సా విద్యార్థుల‌ను సంకెళ్ల‌తో నిర్బంధించిన ఉపాధ్యాయులు

విద్యాబుద్ధులు చెప్పి, చెడు ప్ర‌వ‌ర్త‌న‌కు బానిస‌లు కావ‌ద్దంటూ పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే నలుగురు విద్యార్థులకు సంకెళ్లు వేసిన ఉదంతం హర్యానాలోని యమునానగర్ జిల్లా బాంబేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ చ‌ర్య‌ను స్వ‌యంగా చూసిన ఆ విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారి పిల్ల‌లకి సంకెళ్లు వేసి ఉన్న‌ దృశ్యాల‌ను వీడియో తీసి, స్థానిక పోలీసుల‌కు ఈ చ‌ర్య‌పై ఫిర్యాదు చేశారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దానికి పాల్ప‌డ్డ ముబారక్ ఖాన్, షబ్బీర్ అహ్మద్‌ల‌ను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై నిందితులు స్పందిస్తూ.. స‌ద‌రు విద్యార్థులు మ‌ద‌ర్సా నుంచి వెళ్లిపోతున్నార‌నే కార‌ణంతో సంకెళ్లు వేయాల్సివ‌చ్చింద‌ని చెప్పారు. అయితే త‌మ ఉపాధ్యాయులు త‌మ‌ని నిర్బంధించ‌డానికి కార‌ణం అది కాద‌ని, తాము హోం వర్క్ చేయడం లేదనే కార‌ణంతోనే వారు త‌మ‌ని గొలుసులతో కట్టేస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల గురించి త‌మ పిల్లలు చెబితే మొద‌ట న‌మ్మ‌లేద‌ని, అక్క‌డ‌కి వ‌చ్చి త‌మ క‌ళ్లారా వారి చ‌ర్య‌ను చూసి ఆశ్చ‌ర్య పోయామ‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు పేర్కొన్నారు.

More Telugu News