: లా మేకర్లా? లా బ్రేకర్లా?... ఏడాదిలో 12 మంది ఆప్ ఎమ్మెల్యేల అరెస్ట్... ఎవరిపై ఏ కేసంటే..!

అనూహ్య రీతిలో ఢిల్లీ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకున్న తరువాత, గడచిన ఏడాది వ్యవధిలో 12 మంది ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. తమ నేతలను కుట్ర పూరితంగా కేంద్రం అరెస్ట్ చేయిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కొన్ని కేసులు చాలా తీవ్ర ఆరోపణలతో కూడినవి ఉన్నాయి. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వీరు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టయిన 12 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఏమేని కేసులు ఉన్నాయో పరిశీలిస్తే... 1. శరద్ చౌహాన్: ఆప్ లో ఎదగాలంటే శీలంపై మక్కువ వదులుకోవాలని యువతితో వ్యాఖ్యానించినట్టు ఆరోపణ. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో చౌహాన్ ను జూలై 31న అరెస్ట్ చేశారు. 2. అమానతుల్లా ఖాన్: ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేస్తానని బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. జూలై 24న అరెస్ట్ అయి, జైలుకు వెళ్లి ఆపై బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. 3. రాజేష్ రిషీరిషీ: జనక్ పురి ప్రాంతానికి చెందిన ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో సాక్ష్యాలు లభించడంతో జూలై 26న అరెస్టయ్యారు. ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది. 4. నరేష్ యాదవ్: మలీర్ కోటా పట్టణంలో పర్యటిస్తున్న వేళ ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ ను అవహేళన చేశారన్న ఆరోపణలపై జూలై 24న అరెస్టయ్యారు. 5. ఓ మహిళను వేధించినందుకు జూన్ లో కేసు నమోదై అరెస్టయ్యారు. 6. సోమనాథ్ భారతి: తనను గృహ హింసకు గురి చేస్తున్నాడని స్వయంగా సోమనాథ్ భార్య ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 2015లో ఒకసారి, ఓ యువతిపై దాష్టీకానికి దిగాలని తన మద్దతుదారులను కోరుతున్న వీడియోలు బయటపడటంతో గత నెలలో మరోసారి అరెస్టయ్యారు. 7. మనోజ్ కుమార్: ఢిల్లీ మహిళా కమిషన్ కు మనోజ్ భార్య ఫిర్యాదు చేయగా, జూలై 2015లో అరెస్టయ్యారు. ఓ భూదందా కేసు కూడా ఈయనపై ఉంది. 8. దినేష్ మోహానియా: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, 60 సంవత్సరాల వృద్ధుడిని కొట్టిన కేసులో అరెస్ట్ అయి, ఆపై బెయిల్ తెచ్చుకున్నారు. 9. మహీందర్ యాదవ్: దోపిడీ, ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడం వంటి ఆరోపణలతో ఈ సంవత్సరం జనవరిలో పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆపై బెయిల్ తెచ్చుకున్నారు. 10. అఖిలేష్ త్రిపాఠి: 2013లో నమోదైన దోపిడీ, నేరపూరిత కుట్ర కేసులో నవంబర్ 2015లో పోలీసులు అరెస్ట్ చేశారు. 11. సురీందర్ సింగ్: ఎన్డీఎంసీ ఉద్యోగిపై అందరూ చూస్తుండగానే చెయ్యి చేసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 12. జితేందర్ సింగ్ తోమర్: తప్పుడు విద్యా పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలను ఎదుర్కొన్నారు. డిగ్రీ చదవకుండానే చదివినట్టు సర్టిఫికెట్లు సృష్టించినట్టు తేలడంతో జూన్ 2015లో అరెస్టయ్యారు.

More Telugu News