: ఎవరిని మభ్య పెట్టడానికి ఈ నాటకాలు?: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. అన్యాయానికి గురయ్యామని బాధతో అన్నారు. "సోనియా గాంధీ పుట్టిన రోజున రాష్ట్రాన్ని విడగొడతామని చెప్పారు. ఇటలీ ఇండిపెండెన్స్ డే రోజున నోటిఫికేషన్ ఇచ్చారు. వార్ రూం ఏర్పాటు చేసి, చర్చలు జరిపి, యుద్ధ విమానంలో బిల్లు పంపారు. పార్లమెంటు తలుపులు మూసి విభజించి చాలా తప్పు చేశారు. ఆనాడు విభజన సమస్యలపై ఎనిమిది పేపర్లు పబ్లిష్ చేశాను. ఆ సమయంలో ఢిల్లీలో ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేశాను. దీక్ష సమయంలో ప్రముఖ జర్నలిస్టు కరణ్ ధాపర్ పలుమార్లు... నువ్వు ఎప్పుడు పొట్టి శ్రీరాములు అవుతావని ప్రశ్నించారు. నేను నిరాహార దీక్షలో ఉంటే... జైలు నుంచి వైఎస్సార్సీపీ అధినేత జగన్ బిల్లుకు మద్దతిచ్చి, విడుదలై ఊరేగింపుగా బయటకు వచ్చాడు. ఇవన్నీ కుట్రలు కాదా? రాజకీయ లబ్ధి అన్న కుతంత్రంతో విభజన బిల్లు తీసుకురాలేదా? అది తలచుకున్న ప్రతిసారి బాధ కలుగుతుంది. వాటి నుంచి ఎలాగైనా కోలుకోవాలని నవనిర్మాణ దీక్ష చేపట్టాను, నవ సంకల్పదీక్ష చేపట్టాను. మీరు చేసిన తప్పుడు విధానం వల్ల పంజాబ్ లో తీవ్రవాదం పుట్టుకొచ్చిందని ఆ రోజే నేను చెబితే, ప్రజలను హ్యూమిలియేట్ చేస్తున్నారా? అని అన్ని పార్టీల వాళ్లు విమర్శలు చేశారు. 'అది కాదు, అసంబద్ధ విభజన ద్వారా ప్రజల్లో విద్వేషాలు రేపుతున్నారు మీరు' అని ఆ రోజే చెప్పాను. 'కట్టుబట్టలతో రాష్ట్రాన్ని నడి రోడ్డుపై నిలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ప్రమాదం జరుగుతుందని భావించిన రోజున రోడ్డెక్కారు. ఎవరికి తోచిన విధంగా వారు నిరసన తెలిపారు. బిల్లు ఆమోదం పొందగానే ప్రజలంతా నిరాశకు లోనయ్యారు. దీంతో మా పరిస్ధితి ఏంటి, 60 ఏళ్లు హైదరాబాదులో పెట్టిన పెట్టుబడులు రావు, భవిష్యత్ తరాలు ఇబ్బందుల్లో పడతాయని అందరూ ఆవేదన చెందారు. అలాంటి సమయాల్లో ప్రజలందర్నీ పాజిటివిటీ వైపు మరల్చడానికి చాలా కష్టపడ్డాను. కావాలంటే నా ప్రసంగాలన్నీ చూసుకోండి. ఇలా విభజించి తమ భవిష్యత్ లపై నిప్పులు పోశారని ప్రజలు బాధపడుతూ, తమకు, తమ ఆందోళనలకు, నిరసనలకు, తమ గొంతుకు విలువ లేనప్పుడు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం ఏంటని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అది సరికాదని వారికి నేను హితవు పలికాను. తలుపులన్నీ మూసేసి, లోక్ సభలో అరగంటలో బిల్లు పాస్ చేశారు. దీంతో వివిధ పార్టీలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన నేను పూర్తిగా నిరాశకు లోనై ఆ సాయంత్రమే హైదరాబాదు వచ్చేశాను. సిక్స్ పాయింట్ పార్ములాను అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ తెలిసి, రాష్ట్రానికి అన్యాయం చేసి, ప్రజలను అవమానించారు. ఈ అన్యాయాన్ని సరిచేయమని గత రెండేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాను. విభజన చట్టంలో ఏం పెట్టారు? ఏమిచ్చారు? ఏమివ్వాలి? అని ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడగలేదు. 14వ ఆర్థిక సంఘానికి, విభజనకి సంబంధం ఏంటి? 14వ ఆర్థిక సంఘం ఏపీలో ఆర్థికలోటు ఉంటుందని చెప్పింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్టు ఏపీకి మాత్రమే నిధులివ్వలేదు. ఆర్థిక లోటు పూరించేందుకు అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చారు. అలాగే ఏపీకి ఇచ్చారు, కేవలం ఏపీకి మాత్రమే ఇవ్వలేదు. బిల్లు సందర్భంగా అందరూ హాజరుకావాలని విప్ జారీ చేసిన మీరు (కాంగ్రెస్ ను ఉద్దేశించి) కేవలం రెండు గంటల చర్చకు ఎందుకు అంగీకరించారు? దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సమంజసమే అన్నప్పుడు... ఇదెందుకు ఇవ్వలేదు, అదెందుకు ఇవ్వలేదు? అని బిల్లులో పెట్టిన అంశాల గురించి అడగాల్సిన బాధ్యత మీకు ఉందా? లేదా? బాధ్యత ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ సమాధానం పూర్తి కాగానే ఎందుకు బాయ్ కాట్ చేశారు? బిల్లులో పెట్టిన ఫలానా అంశాలు లేవు అని ఆర్థిక మంత్రిని నిలదీయాలా? లేదా?... ఎవరిని మభ్య పెట్టడానికి ఈ నాటకాలు? ఫ్రెండ్లీ పార్టీ అయినంతమాత్రాన సహాయం చేయమని అరుణ్ జైట్లీ అన్నారు. విభజన సమయంలో ఆదాయం, ఆస్తులు, అప్పులు, వనరులు ఇలా ప్రతిదాంట్లోనూ ఏపీకి అన్యాయం చేశారు. అవన్నీ చూసే అన్యాయం చేశారా? ఇది సరికాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే పార్లమెంటు, రాజ్యాంగంపై నమ్మకం ఉంటుందా?... మీ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? విభజన జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు లెక్కలు తీయండి. అన్యాయం ఎవరికి? ఎంత జరిగిందో తెలుస్తుంది. నిధులు లేవు, అప్పులు చేస్తున్నాం, దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది అంటున్నప్పుడు ఆ రోజు విభజనకు ఎందుకు అంగీకరించారు? ఈ విధానం మంచిది కాదని కేంద్రానికి సూచిస్తున్నాను. జరిగిన అన్యాయం ఒక ఎత్తైతే... రాజ్యసభలో కాంగ్రెస్ నేతల ప్రవర్తన మరింత దుర్మార్గంగా ఉంది. సీతారాం ఏచూరి మాట్లాడుతూ, ఒక కమిటీ ఏర్పాటు చేయండి, ఏపీ సమస్యలు పరిష్కరిద్దామని సూచించారు. అలా ఎందుకు చేయకూడదు? మేము కష్టపడతాము... మీరేం చేస్తారు? భూములిచ్చినా ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ వర్సిటీ ఇంకా రాలేదు. ఒక యూనివర్సిటీలో స్టాండర్డ్స్ నెలకొల్పాలంటే పదేళ్లు పడతాయి. ఈ పదేళ్లు వాటి నిర్వహణ ఎలా?... పోలవరం ఎన్నేళ్లలో పూర్తి చేస్తారో చెప్పారా?...రెండేళ్లు అని మేము చెప్పాము....మీ సహకారం ఇలా ఉంటే అది పూర్తవుతుందా?. కంపెనీలు ఎవరు తెస్తారు? ఇలాంటి కీలకమైన నిర్ణయాలు నిర్లక్ష్యంగా చర్చిస్తారా?" అని ఆయన కడిగి పారేశారు.

More Telugu News