: నాన్న ఫోన్ చేసి, తాను బతికి బట్టకట్టే ఆసలు లేవన్నాడు!: విలపించిన గురుదీప్ కుమార్తె

"మా నాన్న నాకు ఫోన్ చేశారు. ఆయనకు బతుకుతానన్న అన్ని ఆశలూ చచ్చిపోయాయట. ఇక ఆయన మృతదేహాన్నే నేను చూస్తానేమో!" అని ఇండోనేషియాలో మరణదండనకు గురైన గురుదీప్ సింగ్ కుమార్తె మంజిత్ కౌర్ వాపోయింది. 2004లో గురుదీప్ వలస వెళ్లే సమయానికి ఆమె వయసు కేవలం మూడేళ్లు మాత్రమే. 2004లో ఆయన మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయ్యాడు. తండ్రి ఆలనా, పాలనా, ఆయన ప్రేమను రుచిచూడకుండానే పెరిగిన మంజిత్ వయసు పదహారేళ్లు. తండ్రిని కేవలం ఫోటోల్లో మాత్రమే చూసింది. మరణదండన ఖరారైన తరువాత, ఇండోనేషియా జైలు అధికారులు కుటుంబంతో మాట్లాడే అవకాశం కల్పించడంతో ఆయన కాసేపు తన భార్యా పిల్లలతో మాట్లాడారు. కాగా, అధికారులు ముప్పేట వత్తిడి తెస్తుండటంతో, ఇండియాతో మంచి వాణిజ్య బంధాలున్న ఇండొనేషియా ఒక్క మెట్టు వెనక్కు తగ్గి, గురుదీప్ కు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. "ఆయన సోదరుడు సుష్మా స్వరాజ్ కార్యాలయ అధికారులతో నేటి ఉదయం మాట్లాడారు. మేము సుష్మా ప్రయత్నాలపై మాత్రమే ఆశలు పెట్టుకున్నాం. ఆమె నా భర్తను బతికిస్తారన్న నమ్మకంతో బతుకుతున్నాం" అని గురుదీప్ భార్య కుల్వీందర్ కౌర్ వ్యాఖ్యానించారు. తాము ఇండోనేషియా అధికారులతో ఎప్పటికప్పుడు విషయాన్ని చర్చిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఇండోనేషియా అధ్యక్షుడికి క్షమాభిక్ష పిటిషన్ ను పంపే హక్కు గురుదీప్ కు ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News