: నాడు బిన్ లాడెన్ ఆచూకీని అమెరికాకు అందించింది ఇండియానే!

ఆల్ కాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ సుశిక్షితులైన అమెరికా నేవీ సీల్స్ సైనికుల చేతిలో కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ లోని రావల్పిండి సమీపంలోని అబోట్టాబాద్ కు చెందిన ఓ ఇంటిలో కుటుంబంతో పాటు నివసిస్తున్న అతడిపై ఓ రాత్రి నేవీ సీల్స్ మెరుపు దాడి చేశారు. నేవీ సీల్స్ బుల్లెట్ల వర్షానికి లాడెన్ శరీరం తునాతునకలైపోయింది. అప్పటిదాకా నిఘా వర్గాలకు చిక్కని లాడెన్ అబోట్టాబాద్ లో దాక్కున్నాడన్న విషయాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? అమెరికా మాత్రం కాదు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టిన భారత నిఘా వర్గాలే లాడెన్ ఆచూకీని కనిపెట్టాయి. 2006-07 మధ్య ఐఎస్ఐ ఆధ్వర్యంలో జరిగిన రెండు సమావేశాలకు లాడెన్ ప్రధాన అనుచరులుగా భావిస్తున్న అల్ జవహరి, ముల్లా ఒమర్ లు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే వారు రావల్పిండి చేరుకుని అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఐఎస్ఐతో జరిగిన భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు, తాజా పరిస్థితిని లాడెన్ కు చేరవేసేందుకే జవహరి, ఒమర్ లు రావల్పిండి వెళ్లినట్లు భారత నిఘా వర్గాలు అనుమానించాయి. ఈ క్రమంలో లాడెన్ రావల్పిండి సమీపంలోనే ఉన్నాడని ఆ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఇదే విషయాన్ని భారత్... అమెరికాకు చేరవేసింది. భారత్ ఇచ్చిన కీలక సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికా రావల్పిండి సమీపంలోని అబోట్టాబాద్ లోని ఓ ఇంటిలో లాడెన్ ఉన్నాడని కనుక్కుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న వెంటనే అమెరికా తన నేవీ సీల్స్ కమెండోలను రంగంలోకి దించగా, వారు లాడెన్ ను మట్టుబెట్టేశారు. ఈ మేరకు లాడెన్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని భారత నిఘా వర్గాలే అమెరికాకు అందించాయని భారత జాతీయ భద్రతా మాజీ డిప్యూటీ అడ్వైజర్ ఎస్డీ ప్రధాన్ ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

More Telugu News